Music Director Raj: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
ఇటీవల సినీ ఇండస్ట్రీల్లో వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరో ఒక స్టార్ సెలబ్రిటీ కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, కే. విశ్వనాథ్, గాయనీ వాణి జయరాం తదితర స్టార్ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితమే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. బాత్రూమ్ లో కాలు జారడం వల్ల ఆయన గుండెపోటుకు గురయ్యారని, హాస్పిటల్ కు తరలించే లోపే రాజ్ తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజ్ మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల నివాళులు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ సంగీత దర్శకుల్లో రాజ్-కోటి ద్వయం ఒకటి. వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ పాటలు అందించారు. 90వ దశకంలో వచ్చిన సినిమాల్లో రాజ్-కోటి కాంబినేషన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన దాదాపు సినిమాలు మ్యూజికల్ హిట్స్ సాధించాయి. అయితే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వీరి మధ్య విబేదాలు తలెత్తాయి. 1995లో విడిపోయిన వీరిద్దరు ఎవరికీ వారు విడివిడిగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు.
అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడు అయిన రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. లంకేశ్వరుడు, హలో బ్రదర్, యముడికి మొగుడు, బంగారు బుల్లోడు వంటి తదితర చిత్రాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించారు. 1994లో వచ్చిన నాగార్జున హలో బ్రదర్ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది అవార్డ్ సైతం అందుకున్నారు. అంతేకాకుండా రాజ్ సోలోగా మ్యూజిక్ అందించిన తొలి చిత్రం సిసింద్రి. రాజ్ చివరి చిత్రం 2002లో వచ్చిన లగ్న పత్రిక.

రాజ్-కోటి ఇద్దరు కలిసి 180కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. రాజ్-కోటి కాంబినేషన్ మొదటి సినిమా ప్రళయ గర్జన. ఇదిలా ఉంటే రాజ్ మరణం పట్ల ఆయన కుటుంబానికి టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలను రేపు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











