2 అసోసియేషన్లతో హైదరాబాద్‌లోనే సినీ పరిశ్రమ: దాసరి

రాష్ట్రం విడిపోయినా...తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌లోనే ఉంటుందని దాసరి స్పష్టం చేసారు. పరిశ్రమను మరోచోటికి తరలించడం అంటే అంత సులభమైన విషయం కాదని దాసరి చెప్పుకొచ్చారు. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా దాసరి ఈ వ్యాఖ్యలు చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర విడిపోయిన తర్వాత పరిశ్రమలో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదని స్పష్టం చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా తెలుగు బాషే కావడం వల్ల సినీ రంగానికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పరిశ్రమలో రెండు అసోసియేషన్లు ఉన్నా ఇబ్బంది లేదని, రాష్ట్రం విడిపోయింది కాబట్టి రెండు అసోసియేషన్లు ఉండటం సహజమే అన్నారు.
గతంలో తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్ రావడానికి 24 సవత్సరాలు పట్టిందని ఈ సందర్భంగా దాసరి గుర్తు చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు కలిసి హైదరాబాద్‌లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని దాసరి నారాయణరావు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications