రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర-2పై పెరిగిన ఉత్కంఠ
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమాను టాలీవుడ్ ప్రశంసలతో ముంచెత్తుతోంది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఆసక్తిని కలిగిస్తూ వస్తున్న రక్త చరిత్ర శుక్రవారం విడుదలైంది. గురువారం రాత్రి ప్రివ్యూ వేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రివ్యూను చూసి వర్మ సృజనాత్మకతను కొనియాడారు. ఇటువంటి సినిమా తీయడం, ఇలా తీయడం వర్మకే సాధ్యమనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. అనంతపురం జిల్లా ఫాక్షనిజాన్ని కథాంశంగా తీసుకుని నిర్మించిన చిత్రం ఇది. రక్త చరిత్ర మొదటి భాగం మాత్రమే శుక్రవారం విడుదలైంది. రెండో భాగం నవంబర్ 19వ తేదీన విడుదలవుతుంది.
సినిమాలో కథాంశం పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి మధ్య ఘర్షణలేనని భావిస్తున్నారు. అయితే మొదటి భాగంలో వారిద్దరి మధ్య కక్షలు, కార్పణ్యాలు పూర్తిగా తెర మీదికి రాలేదు. వారికి ముందు వారి పెద్దల కథ మాత్రమే ప్రధానంగా ముందుకు వచ్చింది. పరిటాల రవిని ఎన్టీ రామారావు తన పార్టీలో చేరాలని ఆహ్వానించే వరకు మొదటి భాగం సినిమా నడిచినట్లు చూసినవారు చెబుతున్నారు. అసలు కథ రెండో భాగంలోనే మొదలవుతుందని అనుకోవాలి. ఆ రకంగా చూస్తే రక్త చరిత్ర -2పై మరింత ఆసక్తి పెరుగుతోంది. సీక్వెల్ లో ఉత్కంఠను అత్యంత ప్రతిభావంతంగా పోషించిన ఘనత వర్మకు దక్కుతుంది.


Click it and Unblock the Notifications











