పవన్ కళ్యాణ్ తీరుతో ఇబ్బందుల్లో సినీ స్టార్లు.. కోరిక ఉన్నా దూరంగా!
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో తెలుగు సినీ ప్రముఖులు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రవారిని కొడుతున్నారంటూ ఆయన ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఇప్పటికే ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఓట్ల కోసం ఇలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరైంది కాదని తెలిపారు.
తాజాగా సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా పవన్ కళ్యాణ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, ఇక్కడ పూర్తి భద్రతగా ఫీలవుతున్నారని తెలిపారు.

వైసీపీలోకి నట్టి కుమార్
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నట్టి కుమార్ త్వరలో... వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులమతాలకు అతీతంగా ఎన్నో మంచి పనులు చేశారు. వైఎస్ఆర్ ఆశయాలతో రన్ అవుతున్న వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ తీరుతో ఇబ్బందుల్లో సినీ స్టార్లు
కాగా.. భీమవరం సభలో తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ తీరుతో పలువురు సినీ స్టార్లు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఆయనంటే ఇష్టం, జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్నప్పటికీ తాజా పరిణామాలు వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు అంటీ ముట్టనట్లు...
పవర్ స్టార్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని తెలుగు సినిమా రంగంలోని పలువురు స్టార్లు సుముఖంగా ఉన్నారు. నేరుగా వెళ్లే అవకాశం లేనివారు ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణలో ఆంధ్రావారిని తరిమికొడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలతో.... అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని టాక్.

ఇది న్యాయమా? అంటూ ప్రశ్నించిన పోసాని
ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పోసాని పవన్ కళ్యాణ్ తీరును ప్రశ్నించారు. ‘‘పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టే ముందు మాది స్పష్టమైన పార్టీ, మిగతా రాజకీయ పార్టీల్లా కాదు, అందరిలా మాట్లాడను, కమర్షియల్ రాజకీయ నాయకుడిని కాదు అని చెబితే చాలా ఆనంద పడ్డాను. కానీ తెలంగాణలో ఆంధ్రా వారిపై దాడి జరుగకున్నా... ఓటు కోసం తప్పుగా మాట్లాడటం న్యాయంగా ఉందా? ఇక్కడికి వచ్చి కేటీఆర్‌ను వాటేసుకుంటావు, కవితను చెల్లమ్మా అని ట్వీట్ చేస్తావు. అక్కడ భీమవరంలో గెలవడం కోసం నీకు ఓట్లు రావడం కోసం ఆంధ్రవాళ్లను కొడుతున్నావని స్టేట్మెంట్ ఇస్తావా?'' అంటూ విమర్శించారు.


Click it and Unblock the Notifications











