తెలుగు సినిమాలకు కలెక్షన్ల ‘సంక్రాంతి’
హైదరాబాద్ : దర్శక నిర్మాతలు, హీరోల కోణం నుంచి చూస్తే....తెలుగు సినిమాలకి సంక్రాంతి పండగ చాలా కీలకం. ఎందుకంటే ఈ పండగ తెలుగు సినిమాలకు భారీగా కలెక్షన్ల వర్షం కురిపించి లాభాలు తెచ్చే పండగ. పండగ సీజన్ ని సొమ్ము చేసుకోవడానికి ప్రతీసారి పెద్ద సినిమాలు వస్తూనే ఉంటాయి. సంక్రాంతి రేసులో గెలిస్తే....ఆ సంవత్సరం అంతా తమకు కలిసొస్తుందని భావిస్తుంటారు.
ప్రేక్షకుల కోణం నుంచి చూతే....సాధారణంగా సంక్రాంతి పండుగ అనగానే కోడి పందాలు ... ఎడ్ల పందాలు ... గాలిపటాలు అంటూ వయసుల వారిగా తమ దృష్టిని కేంద్రీకరిస్తూ వుంటారు. ఇక అన్నివయసుల వారు దృష్టి పెట్టేది మాత్రం సినిమాలపైనేనని చెప్పొచ్చు. సంక్రాంతి నాటికి పంటలు చేతికొచ్చి రైతులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు చేతి నిండా డబ్బులతో ఉంటారు. తమ తమ అభిరుచికి తగిన విధంగా వాటిని ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అందులో ఎంతో కొంత మొత్తాన్ని సినిమాలపై ఖర్చు పెడుతూ ఉంటారు.
అందుకే తెలుగు సినిమాలకు సంక్రాంతి పండగా అనేది బాగా కలిసొచ్చే సెంటి మెంట్ పండగలా మారి పోయింది. ఎప్పటి లాగే ఈ సంక్రాంతి పండగకు కూడా పలు భారీ సినిమాలు బరిలో నిలవబోతున్నాయి. అందులో ఒకటి వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా అన్నదమ్ములుగా నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కాగా మరొకటి రామ్ చరణ్ 'నాయక్'. అదే విధంగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన తమిళ అనువాద చిత్రం 'విశ్వరూపం' కూడా ఇదే సీజన్లో విడుదలవుతోంది. దీంతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలువుతున్నాయి. ఈ సారి సంక్రాంతి టాలీవుడ్లో సినిమాల బిజినెస్ రూ. 100 పైనే ఉంటుందని అంచనా. ఈ రెండుసినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విజేత అవుతుందో అని అందరూఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత సంవత్సరం మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రంతో, వెంకటేష్ 'బాడీగార్డ్' చిత్రంతో బరిలో నిలిచి బాగానే వెనకేసుకున్నారు. ఈ సారి ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమా(సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు) చిత్రంలో దర్శనం ఇస్తుండగా....వీరిద్దకి పోటీ ఇస్తూ రంగంలోకి దూకుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. మరి ఈ సంక్రాంతి విజేత ఎవరో మరికొన్ని రోజుల తేల నుంది. అదే విధంగా సంక్రాంతి పండగపై బోలెడు ఆశలు పెట్టుకున్న తమిళ హీరో కమల్ హాసన్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











