మరో టాలీవుడ్ బిగ్‌షాట్‌కు హైడ్రా షాక్.. బుల్డోజర్లు పంపొద్దంటూ నటుడి రిక్వెస్ట్ !!
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. జనంలో ఆయన పాపులారిటీ ఏమాత్రం పెరగలేదు. అలాంటిది ఒక్క హైడ్రాతో రేవంత్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా అక్రమ కట్టడాలను ఈ టీమ్ కూల్చివేసినప్పటికీ.. టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ఎవ్వరినీ వదిలిపెట్టరనే భయం మొదలైంది. తాజాగా హైడ్రా టీమ్ మరో టాలీవుడ్ నటుడిని టార్గెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విపత్తుల వేళ సాయం చేసేందుకు , ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ బృందానికి రేవంత్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో రోజుకొక అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తూ చెమటలు పట్టిస్తోంది. రైతుబంధు, కరెంట్ కోతలు తదితర కారణాలతో రేవంత్ గ్రాఫ్ పడుతూ లేస్తూ వస్తోంది. ఇలాంటి వేళ హైడ్రా రాకతో రేవంత్ సర్కార్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ బృందం పనితీరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అన్నింటిలోకి సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేయడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని అత్యంత ఖరీదైన తుమ్మడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున ఈ నిర్మాణం చేపట్టినట్లుగా ఎన్నోసార్లు అభియోగాలు రావడమే కాదు, కొందరైతే కోర్టుకు కూడా ఎక్కారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి ఫిర్యాదులు అందాయి.
అయితే నాగార్జున తన పలుకుబడిని ఉపయోగించి పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపించాయి. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నాగార్జుననే వదలిపెట్టని రేవంత్ తమను వదులుతారా అని పలువురు ప్రముఖులు సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. హైడ్రా ఎక్కడ తమ మీదకు వస్తుందోనని కొందరు భయపడుతున్నారు.
తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన మురళీ మోహన్‌కు చెందిన జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని రంగలాల్ కుంట సమీపంలోని జయభేరి అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు హైడ్రా తన నోటీసుల్లో పేర్కొంది. దీంతో మురళీ మోహన్ నిర్మాణాలను కూడా కూల్చేస్తారా అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మురళీ మోహన్ స్పందించారు. బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ వంటి నిర్మాణం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇందుకోసం హైడ్రా రావాల్సిన అవసరం లేదని, తామే కూల్చివేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం మురళీ మోహన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











