సూపర్‌స్టార్లతో వరుసగా 12 సినిమాలు.. టాలీవుడ్‌ను హడలెత్తిస్తున్న నిర్మాతలు..
Recommended Video

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక సినిమాను తెరకెక్కించి రిలీజ్ చేయాలంటే తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతుంది. ఒకవేళ నానా కష్టాలు పడి సినిమా తీసినా రిలీజ్ చేయలేక ఆగిపోయిన సినిమాలు ఎన్నో. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 చిత్రాల నిర్మాణానికి సిద్ధమవుతున్నది ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ. సినిమాలంటే అల్లాటప్పా హీరోలతో కాదు.. అందరూ సూపర్‌స్టార్లే. సదరు నిర్మాణ సంస్థ ప్రకటన టాలీవుడ్‌నే కాదు.. దక్షిణాది సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది.

2015లో మహేశ్‌బాబుతో శ్రీమంతుడు
సినీ నిర్మాణానికి సవాల్ విసురుతున్న నిర్మాణ సంస్థ పేరంటే మైత్రీ మూవీ మేకర్స్. 2015లో కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్‌బాబు, శృతిహాసన్‌తో శ్రీమంతుడు అనే బ్లాక్ బస్టర్‌ను తీసి తమ సత్తాను నిరూపించుకొన్నారు. ఇందులో నిర్మాతలుగా నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి ఉన్నారు.

ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్
అంతటితో వారి ప్రస్థానం ఆగలేదు. ఆ తర్వాత కూడా కొరటాల శివ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దక్షిణాది సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో జనతా గ్యారేజ్ చిత్రాన్ని తెరకెక్కించి కలెక్షన్లు, రికార్డుల దుమ్ము దులిపారు.

అదే ఊపులో 12 చిత్రాలు
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ విజయాల ఊపుతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీస్ ఏకంగా 12 చిత్రాలకు పచ్చ జెండా ఊపారు. వారు నిర్మించబోయే చిత్రాలు రాంచరణ్, నాగచైతన్య, నాని, విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు సినిమాలు ఉన్నాయి.

రాంచరణ్‌తో రంగస్థలం
ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, విశేషాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి.

నాగచైతన్యతో సవ్యసాచి చిత్రం
అదే ఊపులో చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సవ్యసాచి పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం విలక్షణ నటుడు మాధవన్‌ను రంగంలోకి దించారు.

నానితో కిషోర్ తిరుమల
సవ్యసాచి తెరకెక్కిస్తునే దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో నానితో సినిమాను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుంది.

విజయ్ దేవరకొండతో ఓ చిత్రం
ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకొన్న విజయ్ దేవరకొండతో మరో సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు భరత్‌ను పరిచయం చేయనున్నారు.

పవన్‌తో సంతోష్ శ్రీనివాస్
అజాతవాసి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారు. త్రివిక్రమ్ సినిమా రిలీజైన తర్వాత పీఎస్‌పీకే26 పట్టాలెక్కే అవకాశం ఉంది.

త్రివిక్రమ్‌తో ప్రిన్స్ మహేశ్‌బాబు
అదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్‌బాబుతో ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

సాయిధరమ్ తేజ్, చంద్రశేఖర్ ఏలేటీ సినిమా
మైత్రీ మూవీస్ ప్రణాళికలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ చిత్రం కూడా ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటీ. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

ప్రభాస్, రవితేజలో చిత్రాలు
మొత్తం 12 సినిమాల నిర్మాణంలో ప్రభాస్ చిత్రంతో కూడా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తున్నది. అదే వరుసలో రవితేజతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అఖిల్ అక్కినేని సినిమా కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తున్నది. ఇంకా వారి లిస్టులో బోయపాటి శ్రీనుతో సినిమా, శ్రీను వైట్లతో మరో సినిమాను రూపొందించే ఏర్పాట్లలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











