రజనీకాంత్ దగ్గరకు కూడా చేరలేమంటున్న సల్మాన్
కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ఫాస్ట్ ట్రాక్ లో పరుగులు పెడుతున్నాడు. యాక్షన్ చిత్రాలు 'వాంటెడ్", 'దబాంగ్", ఇక ఇపుడు 'బాడీ గార్డ్". బాలీవుడ్ రజనీకాంత్ గా పేరుపడుతున్నాడు. అయినప్పటికి ఈ నటుడు రజనీకాంత్ స్ధాయికి ఏ మాత్రం దగ్గరవ్వాలన్నా కనీసం 20 ఏళ్ళు పడుతుందని ఎంతో నమ్రతగా, నిజాయతీగా ఒప్పేసుకుంటాడు.
రజనీకాంత్ లానే, సల్మాన్ కూడా ఒకే సారి డజను మంది గూండాలను చావగొట్టగలడు! షర్ట్ ముట్టకుండా బటన్లు తీసి తన ఛాతీ చూపగలడు!! డజను మంది గూండాలను ఒక్కసారి మట్టి కరిపించగలడు, ఎవరైనా రివాల్వర్ తో పేలిస్తే - బుల్లెట్లను తప్పించుకోగలడు !మరో ఆసక్తికర విషయమేమంటే, సల్మాన్ నటించిన ఇటీవలి సినిమాలన్నీ మన దక్షిణ భారత రీ-మేక్ లే! చివరగా నటించిన 'బాడీ గార్డ్" 2010లో అదే పేరుతో మళయాళంలో తీశారు.
నటనలో రజనీకాంత్ ను ఫాలో అవుతున్నావా? అనడిగితే, లేదు..లేదు.. అతని స్ధాయే వేరు అంటాడు. రజనీకాంత్ స్ధాయికి రావాలంటే, ఇంకా 20 ఏళ్ళు పడుతుందంటాడు. తన ప్రస్తుత శైలితో తృప్తి పడుతున్నానంటాడు. 'దబాంగ్"లో 45 ఏళ్ళ లంచగొండి పోలీస్ గా నటించగా, ఇపుడు 'బాడీ గార్డ్" లో కరీనాకు బాడీ గార్డ్ గా నటించాడు.
సల్మాన్ నటించిన 'వాంటెడ్", 'దబాంగ్" లు రెండూ హిందీ సినీ రంగంలో టాప్ గా హిట్టయ్యాయి. ఇపుడు తన బావమరది అతుల్ అగ్ని హోత్రి నిర్మాతగా వున్న బాడీ గార్డ్ కూడా హిట్ కాగలదని ఈ నటుడు ఆశిస్తున్నాడు. 'బాడీ గార్డ్" వచ్చే నెల 31న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











