Tragedy King of Indian cinema no more: దిలీప్‌కుమార్‌ను దేవుడి వద్దకే పంపించాం.. సన్నిహితులు కన్నీటి పర్యంతం
దేశం గర్వించ దగిన ప్రముఖ నటుడు, ట్రాజెడీ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో కన్నుమూసి ప్రపంచ సినీ అభిమానులు విషాదంలోకి నెట్టారు. దిలీప్ కుమార్ మరణాన్ని ఆయన స్నేహితుడు ఫైజల్ ఖాన్ ట్విట్టర్‌లో ధృవీకరించారు. ఇలాంటి విషాద నేపథ్యంలో దిలీప్ కుమార్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన మరిన్ని వివరాలు..

పాకిస్థాన్‌లో పుట్టి భారత్‌లో దిగ్గజ నటుడిగా
దిలీప్ కుమార్ అవిభాజ్య భారత్‌లోని పేషావర్‌లో ఆయేషా బేగమ్, మహ్మద్ సర్వర్ ఖాన్ దంపతులకు డిసెంబర్ 11, 1922 తేదీన జన్మించారు. తన తల్లిదండ్రులకు కలిగిన 12 మంది సంతానంలో దిలీప్ కుమార్ 5 వారు. పండ్ల వ్యాపారి అయిన తన తండ్రి తొలుత కోల్‌కతా, ఆతర్వాత ముంబైలో స్థిరపడ్డారు.

ముంబైతో విడదీయలేని బంధం
యూసఫ్ ఖాన్‌గా ఆయన బాల్యం ముంబైతో విడదీయలేనంతగా ముడిపడింది. అప్పటి బొంబాయిలో అంజుమన్ ఏ ఇస్లాం హైస్కూల్‌లో ఆ తర్వాత ఖల్సా కాలేజ్, విల్సన్ కాలేజీలో చదువుకొన్నారు. ఖల్సా కాలేజీలో చదువుతున్న సమయంలో దిగ్గజ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్‌కపూర్‌తో పరిచయం ఏర్పడింది. ఖాన్, కపూర్ల వంశం పేషావర్ నుంచి భారత్‌కు వలస రావడంతో వారి మధ్య బంధం మరింత ధృడమైంది. ఈ ఇద్దరు భారతీయ సినిమాకు పునాది, మూలస్థంభాలుగా మారారు.

ఆరు దశాబ్దాల కెరీర్‌లో
భారతీయ సినిమా చరిత్రలో దిలీప్ కుమార్‌ది అద్బుతమైన ప్రయాణం. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినీ ప్రేమికులు హృదయాలను భగ్నం చేయడానికి దిలీప్ కుమార్‌గా మారారు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను రంజింప చేశారు. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా మధురమైన పాత్రల్లో జీవించారు.

వెండితెరపై అపురూపమైన దృశ్యకావ్యాలుగా
ఆరు దశాబ్దాల జీవితంలో 60 చిత్రాలకుపైగా నటించారు. ఆయన నటించిన చిత్రాల భారతీయ సినిమా పరిశ్రమలో మరిచిపోలేనటువంటి దృశ్యకావ్యాలుగా మిగిలిపోయాయి. ఆయన నటించిన సినిమాల్లోని పాటలు దేనికి అవే సాటి. దిలీప్ కుమార్ చిత్రాల్లోని పాటలు ఇప్పటి కుర్రకారుకు కూడా గిలిగింతలు పెడుతుంటాయి.

భారత్, పాకిస్థాన్ సర్వోత్తమ పురస్కారాలు
సినీ పరిశ్రమకు దిలీప్ కుమార్ అందించిన సేవలకు గాను భారత, పాకిస్థాన్ ప్రభుత్వాలను ఆయనను సర్వోత్తమ పురస్కారాలతో సత్కరించుకొన్నాయి. భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరిస్తే.. పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశంలోని అత్యున్నత పురస్కారం నిషాన్ ఏ ఇంతియాస్‌తో గౌరవించింది.
Recommended Video

దేవుడి వద్దకే పంపించాం అంటూ
దిలీప్ కుమార్ మరణం గురించి ఆయన స్నేహితుడు ఫైజల్ ఖాన్ ధృవీకరిస్తూ.. దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారని అత్యంత విషాదంలో, గాయపడిన హృదయంతో తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాల క్రితమే ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మనమంతా దేవుడిని నుంచి భూమిపైకి వచ్చాం. మనం ఆయనను దేవుడికే తిరిగి ఇచ్చేశాం అని ఫైజల్ ఫరూఖీ విషాదంతో ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











