త్రిషకు నాలుగోసారి అదృష్టం
బరిలో ఉన్న ప్రత్యర్థులు ఎవరు అనే సంబంధం లేకుండా హీరోయిన్ త్రిషకు నాలుగో సారి కూడా అదృష్టం కలిసొచ్చింది. సంక్రాంతి బరిలో వరుసగా నాలుగోసారి కూడా విజయం తన ఖాతాలో వేసుకుంది. ఆమె వెంకీతో కలిసి నటించిన 'బాడీగార్డ్' మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా చివరకు బాడీగార్డ్, బిజినెస్ మేన్, నందీశ్వరుడు మాత్రమే బరిలో మిగిలాయి. తొలి నుంచి మహేష్ బాబు బిజినెస్ మేన్ పై భారీ అంచనాలు ఉండటం, బాడీగార్డు సినిమా ఇప్పటికే వేరే భాషల్లో వచ్చిన సినిమాకు రీమేక్ కావడంతో...... చాలా మంది బాడీగార్డ్ విజయం పై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వెంకటేష్ తన మార్కను చాటాడు. ప్రేక్షకులు తన నుంచి ఏం కోరుకుంటున్నారనే దాన్నే సినిమాలో చూపించి సక్సెస్ అయ్యారు. ఈ విజయం వెనక త్రిష లక్కు కూడా కలిసి ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే గత సంక్రాంతి పండగలకు విడుదలైన ఆమె సినిమాలు 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'వర్షం', 'కృష్ణ' సినిమాలు భారీ విజయం సాధించడమే.
ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం 'బిజినెస్ మేన్' సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుందంటున్నారు. పైగా ఫ్యామిలీ జనాలు చూడటానికి ఇబ్బంది పడే వల్గర్ లాంగ్వేజ్ సినిమాలో ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే బాడీగార్డు సినిమా అంచనాలకు భిన్నంగా సూపర్ హిట్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజయ్ చేసే పూర్తి వినోదాత్మక సినిమా ఉందని అంటున్నారు. ఏది ఏమైతేనేం...ఈ సంవత్సరం రెండు హిట్లతో టాలీవుడ్ ఖాతా తెరవడంపై పరిశ్రమలో ఆనందం వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











