twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శబ్దాన్నే సైన్యంగా.. నిశ్శబ్దంతో యుద్ధం.. సిరివెన్నెల జయంతి సభలో త్రివిక్రమ్ శ్రీనివాస్

    |

    తెలుగు సినిమా సాహిత్యానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే సాహిత్య సముద్రంలో మునగని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తన కలంతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సిరివెన్నెల గతేడాది నవంబర్ 30న భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. పాటై మనకు వినిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన సిరివెన్నెల. సిరివెన్నెలంటేనే సాహిత్యం.. సాహిత్యమంటేనే సిరివెన్నెల. జగమంత కుటుంబానికి వెలకట్టలేనంత సాహిత్య సంపదను అందించి సిరివెన్నెల మనకు దూరమయ్యాక నేడు ఆయన మొదటి జయంతి. ఈ సందర్భంగా సిరివెన్నెల రచించిన ప్రతి అక్షరాన్ని ముద్రించి పుస్తక రూపంలో అభిమానులకు అందించాలనే బృహత్ యజ్ఞం తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా.తోటకూర ప్రసాద్ సంకల్పించి తానా మరియు సిరివెన్నెల కుటుంబం సహకారంతో సాకారం చేశారు. సినిమా సాహిత్యం నాలుగు సంపుటాలుగా, సినీయేతర సాహిత్యం మరో రెండు సంపుటాలుగా రానున్నాయి. మొదటి సంపుటి గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

     Trivikram Srinivas speech

    సుప్రసిద్ధ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. " సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలా చూశాను చాలాసార్లు. చాలా సంవత్సరాల పాటు మరుపురాని క్షణాలు, గొప్ప గొప్ప పాటలు. నా సినిమాలోవి మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమాలో పాటలు రాసినా సరే అర్థరాత్రి ఫోన్ చేసి శ్రీను మంచి ఒక లైన్ వచ్చింది విను అని చెప్పేవారు. అలాంటి ఎన్నో గొప్ప వాక్యాలను విన్నాను. ఒక కవి పాట పాడుతున్నప్పుడు విని ఆనందించగలడం గొప్ప అదృష్టం. అంతకు మించిన విలాసం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవి గొంతు గొప్పగా లేకపోయినా.. అతని గుండె గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన పాడి వినిపించిన గొప్ప గొప్ప పాటలు నా మదిలో మెదులుతున్నాయి. ఆయనతో గడిపిన సమయం చాలా గుర్తుపెట్టుకోగలిగినది. ఆయన సినిమా పాట కన్నా ఎత్తయిన మనిషి. పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి. అది మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి. దానిని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి. అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం.. ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం అని త్రివిక్రమ్ అన్నారు.

    కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలకు ఆఖరి పేజీ రాకూడదు అనిపిస్తుంది. కొన్ని సినిమాలకు క్లైమాక్స్ చూడకూడదు అనిపిస్తుంది. సీతారామశాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం, అలాంటి ఒక పుస్తకం, అలాంటి ఒక చిత్రం. కళ్ళకి రంగులుంటాయి గానీ కన్నీరుకి రంగు ఉండదు. అలాగే పదాలకు రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన వాటన్నింటిని కలిపి ఒక మనిషిగా తయారు చేసి, ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకు విసరగలిగిన కవిగా ఆయనను చూస్తాను. సముద్రాల రాఘవాచార్యులు గారి దగ్గర నుంచి, పింగళి నాగేంద్రరావు గారి నుంచి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నుంచి, వేటూరి సుందర రామమూర్తి గారి దాకా.. తెలుగు సినిమా కవులు అంత తక్కువ వాళ్ళేం కాదు. చాలా గొప్ప స్థాయి పాటలు రాశారు వాళ్ళు. అలాంటి వాళ్ళ వృక్ష ఛాయలో ఇంకో మొక్క మొలవడమంటే దానికి ఎంత బలం ఉండుండాలి, దానికి ఎంత పొగరు ఉండుండాలి, దానికి ఎంత సొంత గొంతుక ఉండుండాలి అని త్రివిక్రమ్ అన్నారు.

    తన ఉనికిని చాటడానికి ఆయన రెండు చేతుల్ని పైకెత్తి, ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఎలుగెత్తి అరిచాడు. నా ఉఛ్వాసం కవనం అన్నాడు.. నా నిశ్వాసం గానం అన్నాడు. శబ్దాన్నే సైన్యంగా చేశాడు.. నిశ్శబ్దంతో కూడా యుద్ధం చేశాడు. అలాంటి గొప్ప కవి మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన తాలూకు అక్షరాలు మనతోనే ఉన్నాయి. ఒక గొప్ప కవి తాలూకు లక్షణం ఏంటంటే.. కాలాన్ని ఓడించడం. ఎందుకంటే ధర్మం కాలంతో పాటు మారుతుంది.. కానీ సత్యం మారదు. ఆయన సత్యాన్ని మోస్తూ వచ్చాడు. అందుకే ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనకి రెలెవెంట్ గానే ఉంటాయి. అద్భుతం జరిగేముందు మనం గుర్తించం.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరంలేదు. సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం అని త్రివిక్రమ్ అన్నారు.

    English summary
    Trivikram Srinivas speech at Vice President Venkaiah Naidu Unveils Siri Vennela Seetha Rama Shastry Samgra Sahityam book. The book is written by Thotakura Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X