పెళ్ళైన రెండో రోజే వివాదంలో నయనతార.. ఎట్టకేలకు ఊరట.. కేసు కూడా లేకుండానే?
చాలాకాలం పాటు ప్రేమలో మునిగి తేలిన నయనతార -విగ్నేష్ శివన్ జూన్ 9వ తేదీన వివాహ బంధంతో ఏకమయ్యారు. తొలుత వీరి వివాహం తిరుమలలో జరుగుతుందని భావించారు కానీ అనుకోని కారణాలతో ఆ వివాహాన్ని మహాబలిపురానికి మార్చారు. వివాహం జరిగిన వెంటనే అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్న కొత్త జంట అనూహ్యంగా చిక్కుల్లో పడింది. అయితే ఇప్పుడు ఆ జంట చిక్కుల్లో నుంచి బయట పడినట్లు టీటీడీ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

వివాహ బంధంతో ఒక్కటయి
సౌతిండియాలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న నయనతార గతంలో హీరో శింబు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. వారిద్దరితో కూడా వివాహం జరుగుతుందని అందరూ భావించారు కానీ అనేక కారణాలతో వారు విడిపోయారు. తర్వాత ఒక సినిమా షూటింగ్ సమయంలో నయనతార విగ్నేష్ శివన్ ను కలిశారు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే దాదాపు ఏడేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి దుస్తుల్లోనే
నిజానికి తిరుమలలోనే వీరి వివాహం జరగాల్సి ఉంది కానీ వీరి వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరుకావాల్సి ఉంటుంది. కాబట్టి తిరుమల కొండమీద అంతమందికి భద్రత ఏర్పాటు చేయడం కష్టమైన విషయం కావడంతో పాటు సామాన్య జనాన్ని కూడా కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి వివాహాన్ని మహాబలిపురంలో ఒక ప్రైవేటు హోటల్లో చేసుకున్నారు. వారి వివాహం జరిగిన వెంటనే అక్కడి నుంచి నేరుగా తిరుమల చేరుకున్న ఈ జంట వీరి వివాహం అక్కడే జరిగినట్లు అనిపించేలా పెళ్లి దుస్తుల్లోనే ఫోటో షూట్ చేయడానికి ప్రయత్నించారు.

చెప్పులతోనే మాడ వీధుల్లో
అయితే వీరిని చూసిన జనం ఎగబడటంతో అది కరెక్ట్ టైం కాదని వారి రూమ్ కి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత జనం కొంచెం తగ్గిన తర్వాత ఒక్కసారిగా వచ్చి షూట్ చేసుకుని వెళ్లిపోవాలని భావించారు. అలా వస్తున్న సమయంలో నయనతార తన కాళ్లకు చెప్పులు వేసుకుని వచ్చేశారు. దీంతో ఆమె చెప్పులతోనే మాడ వీధుల్లో సంచరించారు. అలాగే మహా ద్వారాన్ని దగ్గరలో ఈ జంట ఫోటోషూట్ కూడా నిర్వహించింది.

సోషల్ మీడియా వేదికగా వివరణ
నయనతార కాళ్ళకు చెప్పులతో మాడ వీధులలో సంచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంటనే ఈ జంట మీద పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సీరియస్ అయింది. ఏ మాత్రం ఉపేక్షించే అవకాశమే లేదని వారి మీద పోలీస్ కేసు నమోదు చేసే విషయంలో న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తామని కూడా వెల్లడించింది. అయితే ఇది కావాలని జరిగింది కాదని పొరపాటున జరిగిందంటూ విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు.

సుప్రభాత సేవలలో పాల్గొనకుండా
దీంతో భక్తులకు క్షమాపణలు చెప్పడంతో నయనతార,విగ్నేష్ దంపతులు వివాదం ముగిసిదని టిటిడి ప్రకటించింది. నయనతార,విగ్నేష్ దంపతులు అందరి భక్తులు లాగానే పరిగణిస్తామని టిటిడి పేర్కొంది. అయితే వివాదం నేపథ్యంలో శనివారం నాడు పాల్గొనాల్సిన సుప్రభాత సేవలలో పాల్గొనకుండా శుక్రవారం సాయంత్రం తిరుమల నుంచి నయనతార,విగ్నేష్ దంపతులు వెనుతిరిగారు.


Click it and Unblock the Notifications











