'చిరంజీవి డూప్' అనేది చెరుపుకోవాలనే ప్రయత్నం
'చిరంజీవి డూప్' అనే పేరు రాకుండా నాదైన సొంత బాణీలో నటిస్తా. ప్రస్తుతం మంచి అవకాశాలే వస్తున్నాయి అంటున్నారు టీవీ ఆర్టిస్టు రాజకుమార్. ఆయన తిరిగి సినిమా రంగ ప్రవేసం చెయ్యాలనుకుంటున్నట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇరవై ఏళ్ల క్రితం దాసరి నారాయణరావుగారు 'అమ్మ రాజీనామా' (1990)తో నన్ను పరిశ్రమకి పరిచయం చేశారు. తర్వాత పదేళ్ల పాటు చాలా సినిమాల్లో నటించా. కన్నడంలోనూ ఆరు సినిమాలు చేశా. 'చిరంజీవిలా ఉంటాడు' అనే పేరు వచ్చింది. అదే నాకు ఇమేజ్‌నీ తెచ్చింది. 'యంగ్ హీరో అంటే రాజ్‌కుమార్' అన్నారంతా..అయితే ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు.
అలాగే మూడేళ్ల నుంచీ మళ్లీ సినిమాల్లోకి రావాలనే అనుకుంటున్నా. అప్పటికే టీవీలో చాలా కమిట్‌మెంట్లు ఉండటంతో ఒక్కొక్కటిగా వాటిని పూర్తిచేసుకుంటూ వస్తున్నా. ఇక నా కెరీర్‌ని సినిమాల్లోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నా. జగ్గయ్య మాదిరిగా యాంటీ హీరో పాత్రలు, గుమ్మడి గారిలా తండ్రి, క్యారెక్టర్ రోల్స్, నూతన్ ప్రసాద్‌లాగా కామెడీ, విలన్ పాత్రలు ఏవైనా సరే - చేస్తా అన్నారు. ఇక రాజకుమార్ గతంలో నాన్నగారు, వెంకన్నబాబు, పచ్చని సంసారం, రౌడీ ఎమ్మెల్యే, నాగబాల, అనుమానం మొగుడు, సంసారాల మెకానిక్, వద్దు బావా తప్పు, పుణ్యభూమి నాదేశం, అత్తా కోడళ్లు, మా ఇంటి ఆడపడుచు, ఇల్లాలు, ఎన్.టి.ఆర్. నగర్, సత్యనారాయణస్వామి వంటి చిత్రాలు చేసారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలు కలిపి మొత్తం 60 దాకా సినిమాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











