రామ్ చరణ్ జంజీర్‌లో రెండు ఐటం సాంగ్స్
రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న జంజీర్ హిందీ సినిమాలో రెండు ఐటం సాంగ్స్ ఉంటాయని నిర్మాత అమిత్ మెహ్రా చెప్పారు. ఒక ఐటం సాంగ్ మెహీ గిల్‌తో ఉంటుందని, మరో ఐటం సాంగ్ కోసం నటిని అన్వేషిస్తున్నా మని ఆయన చెప్పారు. రెండు ఐటం సాంగ్స్‌కు కూడా కథలో ఇమిడిపోయే విధంగా, సందర్భానికి తగినట్లుగా ఉంటాయని ఆయన చెప్పారు. మెహీ గిల్ అమితాబ్ జంజీర్‌లోని బిందు నటించిన మోనా డార్లింగ్ పాత్ర చేస్తుంది. ప్రియాంక చోప్రాతో మే నెలాఖరున షూటింగ్ ఉంటుందని ఆయన చెప్పారు.
పనిలో పనిగా రామ్ చరణ్ నటనాశక్తిని అమిత్ మెహ్రా ప్రశంసించారు. పాత్రకు రామ్ చరణ్ న్యాయం చేస్తాడనే విశ్వాసం ఉందని, చరణ్ నటనాశక్తి తనకు నచ్చిందని ఆయన అన్నారు. అపూర్వ లఖియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలు చూసి తాను జంజీర్ సినిమా హీరోగా ఎంపిక చేసుకున్నానని ఆయన చెప్పారు. హిందీ కూడా బాగా మాట్లాడుతున్నాడని ఆయన చెప్పారు. హీరో పాత్రకు రామ్ చరణ్ చక్కగా కుదిరారని ఆయన అన్నారు.
ఇతర సినిమాలతో ప్రియాంక చోప్రా బిజీగా ఉందని, సినిమాలో నటించడానికి అంగీకరించిందని, మే నెలాఖరున తమతో ఆమె చేరుతుందని, ఇతర నటులతో ప్రస్తుతం షూటింగ్ నడుస్తోందని ఆయన చెప్పారు. సినిమాకు సంగీతం అత్యంత ప్రధానమైంది కావడంతో సంగీత దర్శకుడి కోసం ఇంకా అన్వేషణ సాగుతోంది. ఇదే విషయాన్ని అమిత్ మెహ్రా చెప్పారు. సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవడానికి తమకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు.
జంజీర్ సినిమా షూటింగ్ ఈ నెల 13వ తేదీన ముంబై ఫిల్స్ సిటీలో ప్రారంభమైంది. వచ్చే ఏడాది మేలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికే సినిమా నిర్మాణం పూర్తవుతుందని, కానీ వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











