ఉదయకిరణ్ అబద్ధం వాయిదా
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఉదయ్‌కిరణ్ తమిళ-తెలుగు చిత్రం అబద్ధం (తమిళంలో పోయ్) విడుదల ఆలస్యం కానుంది. ఈ మధ్య హిట్సే కాదు సినిమాలూ తగ్గిపోయిన ఉదయ్‌కిరణ్ ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్న నాటి నుంచి దీనిపై వార్తల మీద వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమాకు నిర్మాత ప్రకాష్ రాజ్. కొందరు బడా తెలుగు హీరోలతో మనస్పర్ధలు వచ్చిన ప్రకాష్‌రాజ్ ఉదయ్‌కిరణ్‌తో సినిమా తీయడాన్ని ఇక్కడి సినిమా పత్రికలు విశేషంగా అభివర్ణించాయి. మే 8న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో కూడా పరోక్షంగా ఉన్న ప్రకాష్ రాజ్ దృష్టి అంతా ఇప్పుడు ఎన్నికల మీదనే ఉంది. ఆయన ఈ సినిమాను మే నెలాఖరులోపు విడుదల చేసే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications