'ఉల్లాసంగా ఉత్సాహంగా' హీరో నెక్స్ట్ ప్రారంభం
తొలి ప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా'తో పరిచయమైన యశోసాగర్ మలి చిత్రం మొదలైంది. 'మిస్టర్ ప్రేమికుడు' టైటిల్ తో ఈ చిత్రం ఆదివారం ప్రారంభమైంది. అమృత్ అమర్‌నాథ్ ఆర్ట్స్ పతాకంపై బి.పి. సోము నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఎన్. మనో అభినవ్ (నాయుడు) దర్శకుడిగా, కన్నడ నటి జయమాల కుమార్తె సౌందర్య శ్రేయాసి నాయికగా పరిచయమవుతున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ముహూర్తపు సన్నివేశానికి 'మంత్ర' దర్శకుడు ఓషో తులసీరాం కెమెరా స్విచ్చాన్ చేయగా, సీనియర్ నిర్మాత డి. రామానాయుడు క్లాప్‌నిచ్చారు. ఈ సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా జరిగిన విలేఖర్ల సమావేశంలో హీరో యశోసాగర్ మాట్లాడుతూ "ఒకటిన్నర సంవత్సరం విరామంతో ఈ సినిమా చేస్తున్నా. మంచి స్క్రిప్టు కోసం వేచి ఉన్నందునే ఈ విరామం. టైటిల్‌కి తగ్గట్లే చక్కని ప్రేమకథతో ఈ సినిమా రూపొందబోతోంది. తొలి సినిమాని మించి ఇందులోని పాత్ర నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకముంది" అన్నారు.
దర్శకుడు మనో అభినవ్ మాట్లాడుతూ సుకుమార్, తులసీరాం వద్ద పనిచేసిన నేను ట్రిక్స్‌తో కూడి లవ్ స్టోరీతో ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నానన్నారు. జూన్ 10 నుంచి తొలి షెడ్యూలు జరుగుతుందన్నారు. ప్రేమలో మిస్టర్ ప్రేమికుడు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని విజయం సాధించాడనేది ఈ చిత్ర కథాంశమని సంభాషణల రచయితలు రమేశ్, గోపి తెలిపారు. ఈ చిత్రంతో తెలుగులో పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉందని నాయిక సౌందర్య చెప్పగా, తెలుగులో వచ్చిన 'వాన' కన్నడ మాతృక 'ముంగార మాలై'కు పనిచేశానని తెలుగుకు పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ కృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications











