హీరోయిన్‌గా మాజీ సీఎం కూతురు.. వెండితెరపైన హిస్టారికల్ స్టోరితో.. !
సాధారణంగా యాక్టర్ల పిల్లలు యాక్టర్లుగాను, రాజకీయ నేతల వారసులు పొలిటిషియన్స్‌గా స్థిరపడటం చూస్తుంటాం. కానీ ఇందుకు విభిన్నంగా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న రమేష్ పొక్రియాల్ నిషాంక్ కూతురు అరుషి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. హిందీ చిత్ర సీమలో ఎంట్రీ ఇస్తున్న అరుషి నిషాంక్ వ్యక్తిగత జీవితం గురించిన వివరాల్లోకి వెళితే...

అరుషి నిషాంక్ గురించి
అరుషీ నిషాంక్ విషయానికి వస్తే.. కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న రమేష్ పొక్రియాల్, కుసుమ్‌కాంత పొక్రియాల్ ముద్దుల కూతురు. ఆమె భారతీయ సంప్రదాయ నృత్యకారిణి. అంతేకాకుండా సామాజిక సేవ చేస్తున్న పర్యావరణ కార్యకర్తగా సుపరిచితులు. అరుషి తండ్రి గతంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

అరుషికి చిన్నవయసులోనే పెళ్లి
అరుషి నిషాంక్‌కు చిన్నవయసులోనే పెళ్లి జరిగింది. 2015లో జనవరిలో అభినవ్ పంత్‌ను వివాహం చేసుకొన్నారు. డెహ్రాడూన్‌లోని హిమాలయ్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తున్నారు.

తరిణి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు
ఇలా విభిన్నమైన కార్యక్రమాలతో బిజీగా ఉన్న అరుషి నిషాంక్ హిందీ సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాను నటిస్తున్న తరిణి అనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టీ సిరీస్ విడుదల చేసింది.

హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమాతో
తరిణి సినిమా విషయానికి వస్తే.. 2017 సెప్టెంబర్ 19వ తేదీన ఐఎన్ఎస్ తరిణిలో ఆరుగురు మహిళా నావికాదళ అధికారులు గోవా నుంచి సాహోసోపేతమైన యాత్రను చేశారు. దాదాపు 254 రోజులు సుమారు 21600 నాటికన్ మైళ్లు ప్రయాణం చేశారు. ఆరుగురు మహిళా నావికాదళ అధికారులకు ఎదురైన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారు.


Click it and Unblock the Notifications











