నా సినిమా 22 కోట్లు వసూలు చేసింది...ఉపేంద్ర
హీరో కమ్ దర్శకుడు అయిన ఉపేంద్ర తాజా చిత్రం సూపర్ కన్నడంలో దాదాపు 22కోట్ల రూపాయలు వసూలుచేసిందని ఉపేంద్ర చెప్తున్నారు. ఈ చిత్రం క్రిందట శుక్రవారమే తెలుగులో విడుదలైంది. ప్రమోషన్ లో భాగంగా బుధవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఆ చిత్రాన్ని మీడియా వారికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ "కర్ణాటకలో ఈ చిత్రాన్ని చాలామంది రాజకీయ నాయకులు చూసి అభినందించారు.ఇది కేవలం రాజకీయ నాయకుల్నే కాక అందర్నీ లక్ష్యంగా చేసుకుని తీసిన చిత్రం.కన్నడలో దాదాపు 22 కోట్ల రూపాయల గ్రాస్‌ని వసూలు చేసింది. పదేళ్ల పాటు ఆర్టిస్టుగా బిజీగా ఉండి డైరెక్షన్ చెయ్యలేకపోయా. అభిమానుల, శ్రేయోభిలాషుల ఒత్తిడితో ఇన్నాళ్లకి ఈ సినిమాని డైరెక్ట్ చేశా. తెలుగులో అవకాశం దొరికితే కచ్చితంగా చేస్తా'' అన్నారు.
చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ "ఈ నెల 11న కన్నడలో ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజు తెలుగులో విడుదల చేశాం.చూసిన అందరూ చాలా బాగుందంటున్నారు. ఉపేంద్ర అభిమానినైన నేను బలవంతం చేసి, మళ్లీ ఈ సినిమాకి డైరెక్టర్ని చేశా'' అని తెలిపారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత, దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ 2030లో భారతదేశం ఎలా ఉండబోతోందో ఈ సినిమాలో చూసి గర్వంగా ఫీలయ్యాననీ, తన శైలిలో ఉపేంద్ర ఈ సినిమాని చాలా బాగా రూపొందించారనీ ప్రశంసించారు. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర సరసన నయనతార హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications











