కరాటే కల్యాణికి న్యాయం చేయండి.. తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు
సినీ నటి, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ కరాటే కల్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. 120కిపైగా సినిమాల్లో నటించిన కరాటే కల్యాణి ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా పాపులర్ అయ్యారు. అయితే సినిమాల కంటే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా హాట్ టాపిక్ అయిన కరాటే కల్యాణి ఏం మాట్లాడిన వివాదం అవుతుందని తెలిసిందే. ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామరావు కృష్ణుడి విగ్రహం ఏర్పాటు విషయంలో కల్యాణి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెను కాపాడలంటూ తెలంగాణ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అసలు ఏమైందనే విషయంలోకి వెళితే..
కాంట్రవర్సీ కామెంట్స్: తెలుగు రాష్ట్రాల్లో నటిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు కరాటే కల్యాణి. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆమె సుధీర్ఘకాలం పాటు హరికథ చెప్పినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి సైతం ఎక్కారు. సీరియళ్లతోపాటు మాటే మంత్రము, మధుమాసం వంటి సీరియళ్లలో అలరించారు. ఇప్పుడు సినిమాలు పెద్దగా లేని కరాటే కల్యాణి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై కాంట్రవర్సీగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు.

మా సభ్యత్వం రద్దు:ఇటీవలే స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కల్యాణి విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వైఖరి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)సభ్యత్వం నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంది. తాజాగా కరాటే కల్యాణికి న్యాయం చేయాలని ద్రావిడ దేశం అధ్యక్షుడు వి. కృష్ణారావు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళ సైకి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ కు వివరణ:ఈ మేరకు వి. కృష్ణారావు శనివారం హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. కొందరు నేతలు రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణుడి పాత్రను పోలి ఉండేలా శ్రీకృష్ణుని విగ్రహం ఏర్పాటు చేయడం తగదని కరాటే కల్యాణి అన్నారని, అంతకు మించి ఎవరినీ విమర్శించలేదని గవర్నర్ తమిళ సైకి ఆయన వివరించారు.

అన్యాయం: గతంలో సినీ నటులు పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ లాంటి వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్టీఆర్ ను కించపరుస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తీసినా ఎలాంటి చర్యలు తీసుకోని మా అసోసియేషన్.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కరాటే కల్యాణిని మాత్రం సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు వి. కృష్ణారావు.

న్యాయం చేయమని:అంతేకాకుండా సోషల్ మీడియాలో కొంతమంది కరాటే కల్యాణి ఫొటోలను జుగుస్పాకరంగా మార్ఫింగ్ చేసి ఫొటోలు పెడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని వి. కృష్ణారావు పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అందుకే గవర్నర్ జోక్యం చేసుకుని కరాటే కల్యాణికి న్యాయం చేయాలని కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











