మూడో రోజే వచ్చేసిన ‘ఉప్పెన’ ఓటీటీ రిలీజ్ డేట్: అప్పటి నుంచే స్ట్రీమింగ్ మొదలు
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. అతడే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన 'ఉప్పెన'తో అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. అలాగే, రెండో రోజూ అదే జోరును చూపిస్తూ భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో రెండు రోజులకే ఏకంగా రూ. 16 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తద్వారా బ్రేక్ ఈవెన్‌కు మరింత చేరువ అయింది.
ఇలాంటి సమయంలో సినిమా విడుదలైన మూడో రోజే 'ఉప్పెన' స్ట్రీమింగ్ డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కాబోతుందట. బడా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రసారం కానుంది. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనేందుకు అమెజాన్, ఆహా సంస్థలు పోటీ పడినప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్ దీన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది. నిబంధనల ప్రకారం.. యాభై రోజులు పూర్తయిన తర్వాత ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'ఉప్పెన'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. షూటింగ్ పూర్తయినా.. థియేటర్లలోనే దీన్ని విడుదల చేయాలని దాదాపు ఏడాది పాటు వేచి చూశారు. అందుకు అనుగుణంగానే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఫిబ్రవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











