ఉప్పెన ట్విట్టర్ రివ్యూ: ఆ రికార్డు బద్దలయ్యేలానే ఉంది.. అదొక్కటే తెలుగు ప్రేక్షకులకు నచ్చదట!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే గ్రాండ్‌గా లాంఛ్ అవుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోనే ప్రత్యేకమైన మెగా ఫ్యామిలీ నుంచి 'ఉప్పెన' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. సాధారణంగా పెద్ద కుటుంబం నుంచి లాంఛ్ అవుతుంటే ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కూడా భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం పలు ప్రాంతాల్లో విడుదలైంది. ఇప్పటి వరకూ అందిన రిపోర్టుల ప్రకారం ఇది ఎలా ఉందంటే?

మెగా మేనల్లుడి ఎంట్రీ ఇలా ప్లాన్ చేశారు
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న చిత్రమే 'ఉప్పెన'. బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రిలీజ్‌కు ముందే రికార్డులు... అంచనాలు
మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాడే అయినా.. కొత్త దర్శకుడితో చేసిన ప్రయోగాత్మక లవ్ స్టోరీతో సాదాసీదాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులోని 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీనివల్ల సినిమాకై ఒక్కసారి హైప్ వచ్చింది. అలాగే, ఆ మధ్య వచ్చిన టీజర్, ఇటీవల వదిలిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేశాయి.

కొత్త హీరోల కాదు.. ఆ స్థాయిలో జరిగింది
పాటతో అంచనాలు పెరిగిపోవడం.. మెగా ఫ్యామిలీ కూడా మద్దతుగా ఉండడంతో 'ఉప్పెన' సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు రూ. 6 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ. 3 కోట్లు, ఆంధ్రా ప్రాంత హక్కులు రూ 10 కోట్లు వరకూ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ 19 కోట్ల వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ రూ. 20 కోట్లుగా ఉంది.

అక్కడ మొదలైన ‘ఉప్పెన’.. ఎలా ఉంది?
ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి పైగా థియేటర్లలో ప్రదర్శితమయ్యేందుకు సిద్ధమైంది 'ఉప్పెన'. ఇందులో భాగంగానే అమెరికాతో పాటు కొన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. దీంతో సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఎక్కువ శాతం దీనికి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దీంతో ఓపెనింగ్ డే రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

వాళ్లిద్దరూ పోటాపోటీగా.. ఆయన మాత్రం
ఇక, ఈ సినిమా చూసిన వారంతా వైష్ణవ్ తేజ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడని చెబుతున్నారు. అతడికి పోటీగా కృతి శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేసిందట. వీళ్లిద్దరూ పోటాపోటీగా నటించారని పేర్కొన్నారు. ఇక, ఇందులో విజయ్ సేతుపతి నటన వేరే లెవెల్ అని సినిమాకు హైలైట్ అని అంటున్నారు.

దర్శకుడి పని తీరు.. ఫామ్‌లోకి వచ్చాడు
'ఉప్పెన'కు సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే అతడు మంచి మార్కులు కొట్టేశాడని సినిమా చూసిన వారంతా చెబుతున్నారు. అతడి టేకింగ్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు ఏం చెప్పాలో అది సూటింగా చెప్పాడని అంటున్నారు. ఇక, ఈ మూవీని మరో లెవెల్‌కు తీసుకెళ్లిన దేవీ శ్రీ ప్రసాద్.. తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడట.

అదొక్కటే తెలుగు ప్రేక్షకులకు నచ్చదట!
'ఉప్పెన' గురించి ఎంత ట్రెండ్ అవుతుందో.. క్లైమాక్స్ సీన్ గురించి కూడా అంతే రీతిలో హాట్ టాపిక్ అవుతోంది. చివర్లో డేంజర్ పాయింట్ అంటూ ఆసక్తిని పెంచేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఇక, సినిమాను చూసిన వారంతా.. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇది కొత్తగా ఉన్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు డిస్సాపాయింట్ అవుతారని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











