'తను మొన్నే వెళ్లిపోయింది' గురించి వంశీ
హైదరాబాద్ : తమిళ డబ్బింగ్ చిత్రం 'రంగం' లో విలన్ గా నటించిన అజ్మల్ తెలుగులో ఇప్పుడు హీరోగా నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. నిఖితా నారాయణ్ హీరోయిన్. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.
వంశీ మాట్లాడుతూ ''ఒక యువతి కోసం సుశీల్, సత్య అనే పెళ్లి కుదిరిన జంట సాగించే అన్వేషణ ఈ కథ. అసలు ఆమె కోసం ఆ ఇద్దరూ వెదకడం... ఆ క్రమంలో కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠపరుస్తాయి. వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ప్రచార పత్రికలకు సామాజిక వెబ్‌సైట్ల మంచి స్పందన వచ్చింది'' అన్నారు.

చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ..''వంశీ శైలిలో సాగే చిత్రమిది. త్వరలో పాటలు విడుదల చేస్తాము. వినోద ప్రధానంగా సాగే సినిమా ఇది. మూడు రోజుల షూటింగ్ మిగిలుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథకు తగ్గట్టు టైటిల్ పెట్టాం. వంశీ మార్కు సినిమా. చక్రి మంచి స్వరాలందించారు''అన్నారు.
హీరో మాట్లాడుతూ... ''ఆహ్లాదభరితమైన ప్రేమ కథ. ఓ యువతి కోసం సుశీల్, సత్య సాగించే అన్వేషణ విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది''అన్నారు.ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.


Click it and Unblock the Notifications











