'బృందావనం' గొప్ప సినిమా అని నేనెప్పుడూ చెప్పలేదు
"ఇది గొప్ప సినిమా కాదు...అని కొన్ని పత్రికలు రాశాయి. గొప్ప సినిమా అని నేనెప్పుడూ చెప్పలేదు. ఇదో తెలుగింటి సినిమా. నూటికి నూరుపాళ్లు తెలుగుదనం నిండిన సినిమా" అన్నారు వంశీ పైడిపల్లి. ఆయన డైరక్ట్ చేసిన 'బృందావనం' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఆ సందర్భంగా అలా స్పందించారు. ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "ఈ సినిమా కోసం రెండే రెండు సందర్భాల్లో బాధపడ్డాను. ఒకటి...అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయలేకపోయాను. రెండు...'బృందావనం' విడుదలైన మూడో రోజున పైరసీ సీడీ కనిపించినప్పుడు. పైరసీని అడ్డుకొనే శక్తి అభిమానులకు మాత్రమే ఉంద"న్నారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ ప్రేమకథలు చేయలేడా? చేతిలో గులాబీ పట్టుకొని ప్రేమికుడిలా కనిపించలేడా? అనే ప్రశ్నలకు సమాధానం 'బృందావనం'లో దొరికింది. రికార్డుల గురించి, వసూళ్ల గురించి పట్టించుకోను. నేను చేసిన చిత్రాల్లోకెల్లా ఇది ఉత్తమ చిత్రం. తమన్ మంచి స్వరాలు అందించాడు. ఈ విజయం చిత్ర బృందం మొత్తానికి దక్కుతుంద"న్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











