నా సినిమాలో మల్లికా షెరావత్: వర్మ
రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'కాంట్రాక్ట్' చిత్రంలో మల్లికా శెరావత్ నటించకపోయినా ఆమె ఫొటోను అందులో చూపించారు. దాంతో తరవాత మల్లికా శెరావత్‌తో వర్మకు పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అలా ఫొటోను వాడుకోవడం ఏంటని మల్లిక తీవ్ర స్ధాయిలోనే కోప్పడింది. దీనిపై సరైన వివరణ ఇవ్వాలని కోరుతూ వర్మకు లీగల్ నోటీసు కూడా పంపించింది. అయితే ఇప్పుడు ఆ సమస్య దాదాపు సమసిపోయినట్లే కనపడుతోంది.
ఈ విషయమై వర్మ మాట్లాడుతూ ''ఇటీవలే మా ఇద్దరి మధ్య సెల్‌ఫోన్‌లో ఎస్.ఎమ్.ఎస్ లు నడిచాయి. ఆ వివాదం ఇప్పుడు పూర్తిగా సద్దుమణిగింది. ఆమెతో పనిచేయాలన్న కోరిక నాకు ఉందని ఆమెతో కూడా చెప్పాను. ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. త్వరలో నా దర్శకత్వంలో రాబోయే 'ఫూంక్-2'లో ఆమె నటిస్తుంది. ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలన్నీ పెద్ద గోయి తీసి పూడ్చేశామ''ని చమత్కరిస్తూ మాట్లాడారు. దీనిపై కామెంట్ చేయటానికి మల్లికా శెరావత్ అందుబాటులో లేదు. ఇక ఈ టాక్ తో మొత్తానికి లీగల్ నోటీస్ వెనక్కి తీసుకోవటానికి మల్లిక ఒప్పుకుందని అందరికీ అర్ధమయింది. అయినా వర్మ ఫూంక్ ఫలితం తెలిసాక కూడా ఫూంక్-2 తీస్తాడా...అందులో ఆమెకు వేషం ఇస్తాడా అన్నది అందరికీ సందేహమే


Click it and Unblock the Notifications











