ఊపిరిపీల్చుకున్న నిర్మాతలు... చిరంజీవికి థాంక్స్!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి అయిన తర్వాత తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమను పీడిస్తున్న పెద్ద సమస్య నుంచి ఉపశమనం కల్పించారు. తెలుగు సినిమాలపై విధించిన 'వ్యాట్'(Value Added Tax) నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసారు. చిరంజీవి ఆయన్ను కన్విన్స్ చేసి తెలుగు సినిమాలపై వ్యాట్ ఎత్తి వేయించారు.
ఈ మేరకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సంబంధించిన నిర్మాతలు, ఆఫీస్ బేరర్లు చిరంజీవిని ఆయన నివాసం వద్ద కలిసారు. తెలుగు సినిమాలపై వ్యాట్ ఎత్తివేయించడంలో చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాట్ ఎత్తి వేయడం వల్ల పరిశ్రమకు, నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని అంతా ఆనందం వ్యక్తం చేసారు.
వ్యాట్ వల్ల నిర్మాతలు భారీ నష్టం ఇలా....
ఇప్పటికే పీకలలోతు సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిర్మాతలపై ఇప్పటికే అమలులో ఉన్న వ్యాట్‌తో పాటు అదనపు వ్యాట్ ట్యాక్స్‌ను విధిస్తూ గతంలో (జి.ఓ ఎంఎస్ నెం.54, డేటెడ్ 19.01.2011 పేర) ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. సినిమా వ్యాపారం అనేది కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పరిధిలోకి వస్తుందని, ఆ మేరకుఇకనుంచి సినిమాకు సంబంధించిన ఏ విధమైన కొనుగోలైనా అమ్మకమైనా సరే వ్యాట్ కట్టాల్సిందేనని సదరు జి.ఓలోని సారాంశం.
ఈ జీవోతో.... ఫలానా హీరో నటించిన సినిమా 1500 ప్రింట్లతో విడుదల చేస్తున్నాం... రెండు వేల ప్రింట్లతో అట్టహాసంగా విడుదల చేస్తున్నాం అని ప్రకటించే నిర్మాతల గుండెల్లో ఇక రైళ్లు పరిగెట్టాయి. ఎక్కువ ప్రింట్లతో... ఆర్భాటపు ప్రచారాలతో కేవలం తొలి రెండు వారాలలోనే కలెక్షన్లు మడతెట్టేసుకుని సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోదామని ఆలోచించే నిర్మాతలకు కొత్తగా కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 'వ్యాట్' పేరిట కొరడా ఝుళిపించడాన్ని తట్టుకోలేక పోయారు. వ్యాట్ రూల్స్ ప్రకారం ముప్పై ఆరు ప్రింట్ల వరకూ పదివేలు ప్రింట్‌కు టాక్స్ చెల్లించాలి. 36 నుంచి 100 ప్రింట్ల వరకూ అయితే ఇరవై వేల టాక్స్ కట్టాలి. 101 నుంచి 150 ప్రింట్లు అయితే ముప్పై వేలు, ఆ పైన వేసే ప్రతీ ప్రింట్‌కూ నలబై వేలు చొప్పున చెల్లించాలి. ఇదంతా ఇప్పటికే సమస్యల లోతులో చిక్కుకుపోయిన నిర్మాతలకు తడిసి మోపెడయ్యే పరిస్థితిని తెచ్చి పెట్టాయి. మన పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ను సినిమా పరిధినుంచి తప్పించాయి.


Click it and Unblock the Notifications











