జొమాటో, స్విగ్గి కుటుంబ వ్యవస్థలను కూల్చేస్తున్నాయి.. వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ రచించిన స్వాతంత్య్రోద్యమం.. తెలుగు సినిమా.. ప్రముఖులు అనే పుస్తకావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. శనివారం (ఏప్రిల్ 8వ తేదీ) ఉదయం హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాష సంఘం సలహాదారు కేవీ రమణాచారి సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య ఎస్.ఈ.డబ్యూ అధినేత రాజశేఖర్. పుస్తక తొలిప్రతిని శ్రీకర ఆర్గానిక్స్ రాజు పాల్గొన్నారు. ఈ వేడుకలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..
వంటగది పోయింది..: దేశభక్తిని పెంచే సినిమాలు, కథలు, నాటకాలు, నాటికలు, పుస్తకాలు ఏవి వచ్చినా గౌరవించాలి. యువతలో స్పూర్తిని కలిగించాలి. అందుకే ఈ పుస్తకం నాకు నచ్చింది. ఏ భాషనైనా నేర్చుకోవచ్చు. కానీ అమ్మ భాషను మరిచిపోవద్దు. ఈ దేశ ప్రజల పట్ల ప్రేమతో నడవాలి. వంటగది ఎప్పుడైతే పోయిందో.. కుటుంబం పోతుంది. దాంపత్య జీవితం పోతుంది. ఇంట్లో వంట చేస్తే అందరం కలిసి తింటాం. కానీ ఇప్పుడు జోమాటో, స్విగ్గీ, ఇంకా ఏవో వాటిని అలవాటు చేసుకొని.. కుటుంబ వ్యవస్థను దెబ్బ తీస్తున్నాం. అనారోగ్యానికి తెచ్చుకొంటున్నాం. పాశ్చత్య సంస్కృతికి అలవాటు పడి పిజ్జాలు తింటున్నాం. సూర్యోదయానికి ముందు లేవడం మనుషులు మరిచిపోయారు అని వెంకయ్య నాయుడు అన్నారు.

రమణాచారి సలహా మేరకు: పుస్తక రచయిత సంజయ్ కిశోర్ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో కె.వి రమణాచారి గారిని కలిసినప్పుడు స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదికా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం చేస్తుంది. నువ్వు కూడా ఏదన్నా చెయ్యి సంజయ్ అని నాలుగు మంచి మాటలు చెప్పారు. నాకు సినిమాపై నాలెడ్జ్ ఉండటంతో ఆరునెలల్లో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టాను అని తెలిపారు.
ఆర్థిక సాయం చేసిన కిమ్స్ అధినేత: స్వాతంత్య్రోద్యమం తెలుగు సినిమా ప్రముఖులు అనే పుస్తకాన్ని రాయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పట్టింది పుస్తకాన్ని తీసుకురావటానికి. నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను నమ్మి ఆర్ధిక సాయం చేసే కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్యగారు, సదరన్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత రాజశేఖర్‌గారు సాయం చేశారు. ఇంతమంచి పుస్తకాన్ని ఆవిష్కరించటానికి సరైన వ్యక్తి వెంకయ్యనాయుడుగారి చేతులమీదుగా విడుదలవ్వటం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని సంజయ్ కిషోర్ అన్నారు.
పుస్తకం చదువుతుంటే రోమాంచితుడినయ్యా : సభాధ్యక్షుడు కె.వి.రమణాచారి మాట్లాడుతూ.. మంచి చేయమని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్తాము. అది విని ఆచరించే సంజయ్ కిశోర్ లాంటి వాళ్లు ఎంతమంది ఉంటారు. అనేక మంచి విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతమంది గొప్పవారి గురించి చక్కగా రాశారు సంజయ్ కిశోర్'' అన్నారు. దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ-'' బుక్‌లోని కొన్ని విషయాలు చదువుతుంటే రోమాంచితుడిని అయ్యాను. ఈ పుస్తకంలో బి.విఠలాచార్య గురించి, అల్లు రామలింగయ్య గురించి రాసిన విషయాలు తెలుసుకుని ఆశ్యర్యపోయాను అని అన్నారు.

సమాజంలో మార్పు రావాలి : మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ రోజు సమాజానికి ఇటువంటి పుస్తకాలు ఎంతో అవసరం. తెలుగు సినిమాలో ఎంతమంది గొప్పవారు ఉన్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రజా ప్రతినిధులే ఎటువంటి పదజాలంతో మాట్లాడుతున్నారో మనందరం గమనిస్తేనే ఉన్నాం, సమాజంలో మార్పు రావాలి'' అన్నారు. సంజయ్ కిశోర్ ఏ పని తలపెట్టినా మా వంతుగా మేము సాయం చేస్తాము. అతను మా కుటుంబసభ్యుడే అన్నారు అని కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య ఎస్.ఈ.డబ్యూ అధినేత రాజశేఖర్. పుస్తక తొలిప్రతిని శ్రీకర ఆర్గానిక్స్ రాజు లక్షా వెయ్యి నూటవరహారు రూపాయాలకు కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ గాయణిమణులు, సినిమా పెద్దలతో పాటు జొన్నలగడ్డ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











