విజయనిర్మల మృతి పట్ల వెంకయ్యనాయుడు సంతాపం
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం యావత్ సినీ లోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. తెల్లవారే సరికి ఆమె మరణ వార్త విని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల మరణ వార్త విన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఆమె కుటుంబానికి తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కొద్దిసేపట్టి క్రితం విజయ నిర్మల మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. విజయనిర్మల మృతి చెందారన్న వార్త తనని కలచి వేసిందని వెంకయ్యనాయుడు పేర్కొన్నాడు. విజయనిర్మల బాలనటిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి ఉన్నత శిఖరాలు అధిరోహించారని గుర్తుచేశారు. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆమె మరణం విచారకరమని ఆయన అన్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల.. తెలుగు సినీ రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచారని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సందర్బంగా విజయనిర్మల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు వెంకయ్యనాయుడు.

విజయ నిర్మల భౌతికకాయాన్ని ఈ రోజు (జూన్ 27) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు రానున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం గానీ, సాయంత్రంగానీ విజయ నిర్మల అంత్యక్రియలు జరుగుతాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











