తన కుమారుడు అర్జున్ ఎంట్రీ గురించి వెంకటేష్
హైదరాబాద్: వరసగా వారసలు తెరంగ్రేటం చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపద్యంలో వెంకటేష్ కుమారుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అంతా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ తనయుడు అర్జున్ తెరంగేట్రం చెప్తూ...వాడికి ఇప్పుడు పదేళ్లు. చదువుకుంటున్నాడు. ఈ తరం ఆలోచనలతోనే ముందడుగు వేస్తోంది. అర్జున్ కూడా రకరకాల ఆలోచనలతో నన్ను ప్రశ్నలు అడుగుతుంటాడు. సినిమాలు చూస్తాడు. ఏమైనా సందేహాలుంటే అడుగుతాడు. సినిమాలొక్కటే కాకుండా... మిగతా విషయాలపై కూడా ఆసక్తి కనబరుస్తాడు. వాడి మైండ్‌లో చాలా ఆలోచనలున్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం అన్నారు.
నేనూ సాధారణమైన మనిషినే. అందరిలాగే నాకూ భావోద్వేగాలున్నాయి. కాకపోతే ఒక సినిమా ఫలితంతోనే అంతే అయిపోందని నేను ఎప్పుడూ అనుకోను. ఫలితం ఆశించకుండా పనిచేయడాన్ని అలవాటు చేసుకొన్నాను. నావరకు శ్రమ పెట్టడమే తెలుసు, ఫలితాన్ని మాత్రం నేను నిర్దేశించలేను కదా. మనసుని మన అధీనంలో ఉంచుకుంటే చాలు... దేన్నైనా జయించవచ్చు అనేది నా నమ్మకం అంటూ వెంకటేష్ సినిమా జయాపజయాలు గురించి చెప్తూ...వివరించారు.
నేను త్వరలో సోలోగా కూడా చేయబోతున్నాను. త్వరలోనే 'రాధ' పేరుతో ఓ చిత్రంలో నటించబోతున్నా. నేనెప్పుడూ సినిమాల్ని హడావిడిగా చేయను. అయినదానికీ, కానిదానికీ హైరానా పడటం నాకు నచ్చదు. ఆచితూచి సినిమాల్ని ఎంచుకొంటాను. ఇటీవల కొన్ని మల్టీస్టారర్ కథాంశాలు బాగా నచ్చాయి. అందుకే ఇలా వేరొకరితో కలిసి నటిస్తున్నాను. 'సీతమ్మ వాకిట్లో...' చక్కటి ఫలితాన్ని సాధించింది. 'మసాలా' కూడా అదే తరహాలో అందరినీ అలరిస్తుందనే నమ్మకముంది. రామ్‌చరణ్‌తో కలిసి చేస్తున్న సినిమా కూడా చాలా బాగుంటుంది. కృష్ణవంశీ కథను తీర్చిదిద్దుతున్న విధానం చాలా బాగుంది అన్నారు వెంకటేష్.మల్టీస్టారర్ చిత్రాలు గురించి చెప్తూ... పరిస్థితి చూస్తుంటే పునర్‌వైభవం వచ్చినట్లే అలాగే అనిపిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చక్కటి ఫలితాన్ని సొంతం చేసుకొంది. ఆ తర్వాత హీరోలంతా కలిసి నటించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు అభిమానులు కూడా అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంది. 'నా అభిమాన హీరో' అనే మాటని కాసేపు అభిమానులు పక్కనపెట్టాలి. తెరపై కేవలం రెండు పాత్రల్లాగే కథానాయకులని చూడాలి. నా హీరోని మీ హీరో ఒరేయ్... అని పిలిచాడని పట్టించుకోరాదు. అలా మనసులో ఏమీ పెట్టుకోకుండా చూశారు కాబట్టే 'సీతమ్మ వాకిట్లో..' అందరికీ నచ్చింది. ఇదే తరహా ఆలోచనలతో సినిమాలని స్వీకరిస్తే... తప్పకుండా భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ చిత్రాలు వస్తాయి అన్నారు.
తన కెరీర్‌లో రీమేక్ చిత్రాలే ఎక్కువ అనే విషయంపై చెప్తూ... కథలు దొరక్కపోవడంతోనే ఇతర భాషలకి చెందిన సినిమాలపై ఆధారపడటం.... అనేదేమీ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కథలు వస్తుంటాయి, వింటుంటాం. అయితే... సినిమా అనేది ప్రధానంగా వ్యాపారంతో ముడిపడింది. ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్ చేయడం తప్పేం కాదు.
మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది. నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి.


Click it and Unblock the Notifications












