మహేష్, నేను మొదటి రోజు నుంచి చాలా క్లారిటీగా
హైదరాబాద్: మహేష్, నేను మొదటి రోజు నుంచి చాలా క్లారిటీగా ఈ సినిమా చేశాం. ఎక్కువ, తక్కువలు గురించి మేం ఆలోచించలేదు. ఈ చిత్రాన్ని మేమిద్దరం ఎంజాయ్ చేశాం. మాతో పాటు యూనిట్ మొత్తం ఎంజాయ్ చేశారు. మా కాంబినేషన్‌లో సీన్స్ తీస్తున్నప్పుడు మొత్తం యూనిట్ సభ్యుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ కనబడింది. మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నప్పుడు హీరోల శారీరక భాష బాగుండాలి. ఈ చిత్రంలో మహేష్, నా కెమిస్ట్రీ బాగుందంటున్నారు అంటున్నారు వెంకటేష్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఆయన పెద్దోడి పాత్రను పోషించారు. తన పాత్ర గురించి, ఇతరత్రా విశేషాలను గురించి వెంకటేష్ విలేకరులతో మాట్లాడారు.
'పూలకుండీని ఎందుకు తన్నావురా' అని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' డైలాగ్ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. థియేటర్లకు వెళ్ళి ఎన్నో ఏళ్ళు గడిచిన ఆడవాళ్ళందరూ మరలా ఈ సినిమాకోసం బయటకు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను నిర్మించినందుకు దిల్‌రాజుకో, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకో, నాకో, మహేష్‌కో కాదు మంచి మార్కులు వేయాల్సింది. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మంచి మార్కులు వేయాలి. వాళ్లు ఆదరిస్తేనే తదుపరి ఇలాంటి సినిమాలను ఎవరైనా ధైర్యంగా నిర్మిస్తారు'' అని అంటున్నారు హీరో వెంకటేష్.
ఇద్దరు హీరోలు అనగానే నాకు ఇంత స్పేస్ కావాలి? అతనికెంత? అనే గొడవలుంటాయి. కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు. టోటల్‌గా ఫిల్మ్‌లో ఫీల్‌రావాలనే కృషి చేశాం. సెట్‌లో సరదాగా ఉండే మహేష్ సీన్‌లోకి ఎంటర్ కాగానే చటుక్కున చేసేవాడు. తన టైమింగ్ సూపర్‌గా అనిపించేది. చూసిన వాళ్ళంతా నిజంగా అన్నదమ్ములుగా ఉన్నాం అని అంటున్నారు. కృష్ణగారైతే అంత ఎమోషన్‌ను ఎలా క్యారీ చేశావని చాలా ప్రశంసిస్తున్నారు అన్నారు.
అలాగే రచయితలు కొత్త కథలు తయారు చేయడానికి ఈ సినిమా స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలతో మాస్ సినిమానే కాదు, చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా తీయొచ్చని రుజువు చేసిందీ సినిమా. భవిష్యత్తులో ఈ దారిలోనే చాలామంది పయనిస్తారని నా నమ్మకం. ఈ విషయంలో దర్శకుడు శ్రీకాంత్‌ని అభినందించాల్సిందే అని అన్నారు.


Click it and Unblock the Notifications











