ఏదో అనుకున్నానురా.. చాలా ఎదిగిపోయావ్.. రానాపై వెంకీమామ ఎమోషనల్
రానా దగ్గుబాటి ప్రస్తుతం అరణ్య సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్యాన్ ఇండియన్ చిత్రంగా రాబోతోన్న అరణ్య మూవీ మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు శేఖర్ కమ్ముల, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ అరణ్య, రానా నటన గురించి మాట్లాడుతూ స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యాడు.

ఎంతో గొప్పగా..
నేను మామూలుగా బయటకు రాను. నా సినిమాల ముందు మాత్రమే వస్తాను. కానీ ఇప్పుడు అరణ్య సినిమా కోసం ఇలా మీడియా ముందుకు వచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడికి నన్ను ప్రకృతి పిలిచింది. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇలాంటి చిత్రాలు మళ్లీ మళ్లీ రావు. ఈ సినిమా చూశాక మనమంతా గర్వపడతాం. ఇలాంటి సినిమా ఇండియన్ స్క్రీన్ మీద చూసి గర్వపడతారు. ప్రకృతిని సరిగ్గా చూసుకోకపోతే మనకు మనుగడ ఉండదని డైరెక్టర్ ప్రభు సోలోమన్ ఎంతో గొప్పగా చూపించాడు అని వెంకటేష్ అన్నాడు.

జీవించేశాడు..
అరణ్య సినిమాను నిన్న చూశాను.. రానా అద్భుతంగా నటించాడు. లీడర్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి, కృష్ణం వందే జగద్గురుమ్, బాహుబలి ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు.. ఎంతో కొంత నేర్చుకుంటున్నాడులే అనుకున్నాను. కానీ అరణ్యలో మొదటి ఫ్రేమ్ నుంచి అదరగొట్టేశాడు. ఇంట్లో వాడని చెప్పడం లేదు. సాటి నటుడిగా ఈ విషయాలు చెబుతున్నాను అని వెంకటేష్ ఎమోషనల్ అయ్యాడు.

ఏదో అనుకున్నానురా..
నటులందరికీ ఇలాంటి గొప్ప పాత్రలు రావు. ఓ నటుడికి ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ వచ్చినప్పుడు సహనటుడిగా ఎంతో గర్వపడుతుంటాం. అడవి మనిషి పాత్రలో రానా జీవించేశాడు. ఏదో అనుకున్నానురా.. చాలా ఎదిగిపోయావ్.. ఇక ఇప్పుడు నాకు సవాల్ మొదలైంది. ఈ క్యారెక్టర్ కోసం రానా ఎంతో రీసెర్చ్ చేశాడు. రెండు మూడేళ్లు దీని మీదే కూర్చున్నాడు అని వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

ప్రతీ ఫ్రేమ్‌లో..
అడవిలోనే షూటింగ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమాపై ఇంతటి పాజిటివిటీ క్రియేట్ అయి ఉంటుంది. అరణ్య మూవీ సాంకేతికంగా మరో లెవెల్‌లో ఉంటుంది. ఇది ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. రానా కష్టాన్ని ప్రతీ ఫ్రేమ్‌లో ఆడియెన్స్ చూస్తారని వెంకీమామ తెలిపాడు.

ఏనుగుల నటన..
నడక, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో రానా అద్భుతంగా నటించేశాడు. ఇక ఏనుగుల నటనను కూడా అద్భుతంగా క్యాప్చర్ చేసేశారు. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా.. ఇది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని వెంకటేష్ అన్నాడు.


Click it and Unblock the Notifications











