వెంకటేష్ 'బాడీగార్డ్' కథేమిటి?
వెంకటేష్ హీరోగా గోపీచంద్ మలినేని దర్సకత్వంలో రూపొంది సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రం 'బాడీగార్డ్'. ఈ చిత్రం కథ గురించి దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ...ఒక అందమైన అమ్మాయికి రక్షణగా నిలిచిన బాడీగార్డ్ ఇతను. ఒక పెద్దాయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతన్ని దేవుడిగా భావిస్తూ ఆయన వెన్నంటే ఉంటాడు. ఆ పెద్దాయన కూతురుకి కొంతమంది నుంచి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే నమ్మకస్తుడైన ఆ యువకుణ్ని తన కూతురుకి రక్షణగా ఏర్పాటు చేస్తాడు. అక్కడి నుంచి ఆ బాడీగార్డ్‌కి ఎదురయ్యే తమాషా అనుభవాలు... సరదా ప్రేమాయణంతో కథ ముందుకు నడుస్తుంది అన్నారు.
అలాగే... తొలి సగభాగంలో వినోదంపరంగా వెంకటేష్ విశ్వరూపాన్ని చూడొచ్చు. క్లైమాక్స్ సన్నివేశాలకు ముందు నుంచీ వచ్చే ఘట్టాలు చిత్రానికి ప్రాణం పోస్తాయి. మనసుని హత్తుకొనేలా భావోద్వేగాన్ని పండించారు. అలాగే ఆయన చిత్రాల్లో పాటలు ఎప్పుడూ బాగుంటాయి. దీనికి తమన్ అందించిన పాటలూ కలిసొస్తాయి. ఇక మూడు భాషల్లో విజయవంతంగా నవ్వుల్ని పంచిపెట్టాడు 'బాడీగార్డ్'. తెలుగులోనూ అంతకు రెట్టింపు స్థాయిలో వినోదాన్ని పంచుతాడు. ఈ కథకి మాతృక అయిన మలయాళంలో దిలీప్ నటించారు. తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ చేశారు. ఎవరు ఈ సినిమా చేసినా... కథ మాత్రం వెంకటేష్ కోసమే పుట్టినట్టుగా అనిపిస్తుంటుంది. ఆయన హావభావాలకు సరిపడే కథ ఇది అని ధీమాగా చెప్పుకొచ్చారు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications











