వెంకటేష్ నెక్ట్స్... పూర్తి మూకీ సినిమా
హైదరాబాద్: వెంకటేష్ త్వరలో ఓ మూకీ సినిమాలో కనపించనున్నారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ప్రతీ సారి హీరోయిజం కన్నా వైవిధ్యతకు పెద్ద పీట వేసే వెంకటేష్ ఈ మధ్యనే ఈ తరహా స్క్రిప్టుని ఓకే చేసినట్లు తెలుస్తోంది. 'పిల్ల జమీందార్' ఫేమ్ అశోక్ ఇటీవలే వెంకటేశ్‌ని కలిసి ఓ కథ చెప్పారట. ఆ కథ విని వెంకటేశ్ బాగా ఇంప్రెస్ అయినట్టుగా సమాచారం. కమల్‌హాసన్ 'పుష్పక విమానం' తరహాలో మూకీ సినిమాగా ఆ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందనేది ఫిలింనగర్ వర్గాల సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలోనే ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం 'షాడో'లో మాఫియా డాన్‌గా మాస్ రోల్ చేస్తున్న ఆయన, ఆ తర్వాత 'బోల్ బచ్చన్' హిందీ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో 'బోల్ బచ్చన్' రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. తమాషా కథాంశంతో ఆద్యంతం వినోదాన్ని పంచిపెట్టిన బాలీవుడ్ చిత్రం 'బోల్ బచ్చన్'. వచ్చీ రాని ఆంగ్లంతో అజయ్ దేవగణ్, ఒక్కడే అయినా ఇద్దరిలా ప్రవర్తించే అభిషేక్ బచ్చన్‌ల పాత్రలు భలే నవ్వించాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో పునఃనిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అజయ్, అభిషేక్‌ల పాత్రల్లో వెంకటేష్, రామ్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
డి.సురేష్ బాబు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్ సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు. 'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
"అవును, నేను రామ్ కలిసి బోల్ బచ్చన్ రీమేక్ ని తెలుగులో చేస్తున్నాం. సినిమా టైటిల్, దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే సంవత్సరంలో చిత్రం ప్రారంభం అవుతుంది." అని తేల్చి చెప్పారు వెంకటేష్. గత కొద్ది రోజులుగా వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో మరో మల్టి స్టారర్ గా బోల్ బచ్చన్ రీమేక్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే అవి కొందరు రూమర్స్ అని కొట్టిపారేసారు. అయితే తాజాగా వెంకటేష్ తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పి,రూమర్స్ ని నిజం చేసారు.


Click it and Unblock the Notifications











