‘అత్తారింటికి...’ మూడుసార్లు చూశా
నెల్లూరు: ‘‘చిన్నప్పుడు ఎన్టీఆర్ ‘గుండమ్మ కధ', ‘మాయాబజార్', ఏఎన్‌ఆర్ ‘సువర్ణసుందరి' సినిమాలను చూశాను. తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్లయితే, మూడో నేత్రం చిరంజీవి. నేను సినిమాలు చూడడం అతి తక్కువ. అలాంటిది పవన్ ‘అత్తారింటికి దారేది' సినిమా మూడుసార్లు చూశా'ను. పవన్ అద్భుతంగా చేశార'ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.
‘‘మోదీ నాయకత్వం దేశానికి కావాలని కోరుకున్న వారిలో పవన్‌కల్యాణ్ ఒకరు. ఆయన యువ కెరటం. పదవుల కోసం ఎన్నడూ పవన్ ప్రయత్నాలు చేయలేదు. వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమ పడుతున్నారు. యువత ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి'' అని వెంకయ్య కోరారు.
తదపరి పవన్ కళ్యాణ్...వెంకయ్య నాయుడుని పొగడ్తల్లో ముంచెత్తారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిద్ధాంతం కోసం నిలిచే నేత అని, విభజనపై ఆయన ఒక్కరే పార్లమెంటులో పోరాడారని గుర్తు చేశారు. ‘‘నేను నెల్లూరులోనే పుట్టి పెరిగాను. చిన్నతనం నుంచి వెంకయ్యనాయుడును చూస్తున్నాను. మా నాన్న ఆయనతో కలిసి జై ఆంధ్రా ఉద్యమంలో పోరాడారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌ను వెంకయ్య నెల్లూరుకు తీసుకువచ్చారు'' అని చెప్పారు.

పవన్ మాట్లాడుతూ...‘‘స్వచ్ఛభారత్ అంటే ఫొటోలు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయినప్పుడే పరిశుభ్రమైన సమాజం అవతరిస్తుంది'' అని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. స్వచ్ఛభారత్ ప్రచారం కోసం తెలుగు రాష్ర్టాల నుంచి ఎంపికచేసిన ప్రముఖుల్లో ఒకరైన పవన్ కల్యాణ్, తొలిసారి ఈ కార్యక్రమంపై స్పందించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘సంక్రాంతి సంబరా'ల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తనదైన శైలిలో నేతలకు చురకలు అంటిస్తూ పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది.
స్వచ్ఛ భారత్ అంటే.. భారతీయ జనతా పార్టీనో, ప్రధాని మోదీనో కాదు. ప్రతి భారతీయుడి భాగస్వామ్యం ఉన్నప్పుడే అది సాధ్యం. సంవత్సరంలోనో లేదంటే ఐదేళ్లలోనో భారత్‌ను పరిశుభ్ర దేశంగా మార్చడం కుదిరే పనికాదు. భారతదేశం ఉన్నంతకాలం ఈ కార్యక్రమం కొనసాగాలి'' అని తెలిపారు.
‘‘స్వచ్ఛ భారత్ గురించి మోదీ మాటలు విన్నప్పుడు నేను కూడా అనుమానించాను. ఇది సాధ్యమా అని అనిపించింది. అయితే, దాన్ని సాధ్యం చేయడం ఒకరిద్దరితోనే అయ్యేది కాదని, ప్రతి ఒక్కరూ బాధ్యత పడాల్సి ఉంటుందని ఆ తరువాత తెలుసుకొన్నాను. అందువల్లనే నా వంతుగా నేను స్వచ్ఛభారత్‌లో పని చేస్తాను. నా అభిమానులకు కూడా ఇదే పిలుపునిస్తున్నాను'' అని చెప్పారు.
దేశంలో ఇల్లు లేకపోయినా ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్లు కనిపిస్తున్నాయని, కానీ, కనీస అవసరాలను మాత్రం తీర్చుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘టెక్నాలజీ పరంగా దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. కానీ, అదేదీ మనిషి అవసరాలకు ఉపయోగపడడంలేదు. ఇప్పటికీ ఆడబిడ్డలకు మరుగుదొడ్లు లేవు. ఉన్నావాటికి తలుపులు లేవు'' అని వాపోయారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ చైర్మన్ మాగంటి రాజేంద్రప్రసాద్, ప్రముఖ మృదంగ వాయిద్యకారుడు యల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంక్రాంతి సంబరాలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అంతకుముందు అక్షర విద్యాలయాన్ని ప్రముఖులు సందర్శించారు.


Click it and Unblock the Notifications











