ఎవరీ రుక్మనంద రావు?... బాలయ్యకు, వెన్నెల కిషోర్‌కు ఏమిటి లింకు?
బాలయ్య ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెన్నెల కిషోర్.... రుక్మనందరావు అనే పాత్రలో కనిపించబోతున్నారట. బాలయ్య, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది.

ఎవరీ రుక్మనంద రావు?
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సోదరుడే ఈ రుక్మనందరావు. ఎన్టీ రామారావుకు మొదటి నుంచీ ఆయన మేనేజర్‌గా పని చేశారు. ఈ పాత్రకు వన్నెల కిషోర్ అయితే బాగా సూటవుతాడని దర్శకుడు క్రిష్ ఎంపిక చేశారట.

సీరియస్ పాత్రలో...
వెన్నెల కిషోర్ అంటేనే మనకు కామెడీ సీన్లు గుర్తుకు వస్తాయి. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌లో మాత్రం ఆయన చాలా సీరియస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

కీలక పాత్రల్లో...
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.

రెండు భాగాలు
ఎన్టీఆర్ సినీ జీవితం, రాజకీయ జీవితం రెండింటిని ఒకే సినిమాలో చూపించడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన సినీ జీవితం ‘కథానాయకుడు'గా, రాజకీయ జీవితం ‘మహానాయకుడు'గా వచ్చే జనవరి 9, జనవరి 24 విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











