ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కుటుంబంలో విషాదం
టాలీవుడ్ కమెడియన్ వేణు మాధవ్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో శనివారం మరణించారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఇసిఐఎల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం విక్రమ్ బాబు మరణించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన విక్రమ్ బాబు పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. విక్రమ్ బాబు మరణం వేణు మాధవ్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

విక్రమ్ బాబు
చిత్ర పరిశ్రమలో విక్రమ్ బాబు అందరితో ఎంతో హుందాగా వ్యవహరించే వారని గుర్తు చేసుకుంటున్నారు. కాప్రాలోని మంగాపురంలో విక్రమ్ బాబు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. పది రోజుల క్రితం తన కూతురు వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

హ్యాపీ మూడ్లో నుంచి బయటకు రాక ముందే...
కుటుంబ సభ్యులు తమ ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన హ్యాపీ మూడ్లో నుంచి ఇంకా బయటకు రాకముందే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న విక్రమ్ బాబు హఠాన్మరణం షాక్‌కు గురి చేసింది.

ముగిసిన అంత్యక్రియలు
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల అశృనయనాల మధ్య శనివారం సాయంత్రం లక్ష్మీ నగర్ శ్మషాన వాటికలో విక్రమ్ బాబు అంత్యక్రియలు ముగిశాయి.

వేణు మాధవ్, కుటుంబ సభ్యులకు ఓదార్పు
వేణు మాధవ్ సోదరుడి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి చెందిన ఇతర వ్యాపారులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. విక్రమ్ బాబు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.


Click it and Unblock the Notifications











