కమెడియన్ వేణు మాధవ్ పరిస్థితి చూసి.. జీవిత,రాజశేఖర్ ఎమోషనల్
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్.. ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
వేణు మాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని తెలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు జీవిత రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ సహా పలువురు టాలీవుడ్ కమెడియన్ యాక్టర్స్ ఒక్కొక్కరుగా హాస్పిటల్‌కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లతో మాట్లాడారు జీవిత రాజశేఖర్. ఈ మేరకు వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వేణు మాధవ్ ఆరోగ్యం బాగుపడాలని సినీ ప్రముఖులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు.

వేణు మాధవ్ స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్. సూర్యపేట జిల్లా కోదాడలో ఆయన జన్మించారు. వేణు మాధవ్ తండ్రి టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్ ఇన్‌స్పెక్టర్ పనిచేసేవారు. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ గా పని చేసేది. 5వ తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న ఆయన.. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం లాంటివి చేసి ఆకర్షించేవారు.
1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన 'సంప్రదాయం' చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు వేణు మాధవ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తొలిప్రేమ' సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొని తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా రాణించారు. అదే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'హంగామా' సినిమాతో హీరో కూడా అయ్యారు వేణు మాధవ్.


Click it and Unblock the Notifications











