Balagam సినిమా అరుదైన ఘనత.. కానిస్టేబుల్ పరీక్షలో చిత్రంపై ప్రశ్న.. వేణు ఏమన్నాడంటే?
జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అంటూ కామెడీ పండించిన వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం (Balagam Movie). టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 3న విడుదలైన బలగం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకుని సత్తా చాటింది. అంతే కాకుండా కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న రావడం ప్రస్తుతం విశేషంగా మారింది.
అందమైన భావోద్వేగపు:కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ ఇతరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం బలగం. బుల్లితెరపై కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న వేణు ఎల్దండి (టిల్లు వేణు) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఓ కుటుంబంలో పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని.. అంత్యక్రియలు, దశదిన కర్మ, పిట్టకు పెట్టుడు, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్థలు, భావోద్వేగాల అంశాలతో అందమైన భావోద్వేగపు కామెడీ డ్రామాగా సినిమా వచ్చింది.

అరుదైన ఘనత..:బలగం సినిమాకు ఇప్పటికే లాస్ ఏంజిల్స్ అవార్డ్స్ వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ పురస్కారాలతోపాటు పలు అరుదైన సత్కారాలు వరించాయి. తాజాగా 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్ జ్యూరి క్యాటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ పురస్కారం దక్కింది. ఇక అవార్డుల సంగతి పక్కన పెడితే తెలుగులో ఏ సినిమా సాధించని ఘనతను బలగం చిత్రం సాధించింది.

ఆదివారంతో ముగింపు:సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే ఏ పోటీ పరీక్షలోనైనా సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడగరు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువత ఎదురుచూసే కానిస్టేబుల్ పరీక్షలో బలగం సినిమాపై క్వశ్చన్ రావడం అరుదైన గౌరవంగా భావించవచ్చు. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి.

ఎలాంటి ప్రశ్న అంటే?:మార్చి 2023లో ఒనికో ఫిలింస్ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది? అని కానిస్టేబుల్ ప్రశ్న పత్రంలో అడిగారు. దానికి ఆబ్జెక్టివ్స్ కింద 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం
2. ఉత్తమ డాక్యుమెంటరీ చలన చిత్ర విభాగం 2. ఉత్తమ నాటకం చలన చిత్ర విభాగం 3. 4. ఉత్తమ సంభాషణ చలన చిత్రం విభాగం అని నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఉత్తమ నాటకం సరైనా సమాధానం.
చేతులెత్తి మొక్కుతూ: ప్రస్తుతం బలగంపై ప్రశ్న రావడం విశేషంగా మారింది. తాజాగా దీనిపై డైరెక్టర్ వేణు సంతోషం వ్యక్తం చేశాడు. "నిన్న నా స్నేహితుడు ఒకరు ఈ ఫొటో పంపారు. చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. నా కలను నిజం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని ట్విటర్ వేదికగా షేర్ చేశాడు వేణు.


Click it and Unblock the Notifications











