వామ్మో 'ఆర్ఆర్ఆర్' గురించా.. ఇది విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం కాదు.. శ్రీనివాస్ మోహన్!
భారీ చిత్రం ఏదైనా సిద్ధం అవుతుందంటే అందులో గ్రాఫిక్స్ ప్రధాన అంశంగా మారిపోయింది. అలాంటి భారీ చిత్రాలకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీనివాస్ మోహన్. బాహుబలి1, 2.0, ఐ లాంటి భారీ చిత్రాలకు శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేశారు. రోబో, బాహుబలి 1 చిత్రాలకు శ్రీనివాస్ మోహన్ బెస్ట్ విఎఫ్ఎక్స్ విభాగంలో జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ మోహన్ మరిన్ని భారీ చిత్రాలకు సిద్ధం అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి కూడా శ్రీనివాస్ మోహనే విఎఫ్ఎక్స్ అందిస్తుండడం విశేషం.

బాహుబలి 2 చేయకపోవడానికి
బాహుబలి1 చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస్ మోహన్ బాహుబలి 2కి పనిచేయలేదు. అందుకు భాదగా లేదని శ్రీనివాస్ అన్నారుఆ చిత్రాన్ని చేయలేకపోవడానికి గల కారణాలని శ్రీనివాస్ మోహన్ వెల్లడించారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఐ, 2.0 చిత్రాల బిజీ షెడ్యూల్ కారణంగానే తాను బాహుబలి 2 చేయలేక పోయానని శ్రీనివాస్ మోహన్ తెలిపారు.

ముందుగా ఏడాదిన్నర మాత్రమే
బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనని రాజమౌళి చెప్పినప్పుడు చాలా భారీ ప్రాజెక్ట్ అనిపించింది. ఆ సమయంలో రాజమౌళికి రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఏడాదిన్నర లోపే ఈ చిత్రాన్ని ఫినిష్ చేస్తానని చెప్పారు. కానీ ఆ తరువాత రెండు భాగాలుగా తెరకెక్కించడంతో ఎక్కువ సమయం పట్టింది. బాహుబలి కంటే ముందే 2.0 చిత్రానికి పని చేస్తానని శంకర్ కి మాట ఇచ్చాను. బాహుబలి 1 పూర్తి కాగానే శంకర్ 2.0 ప్రారంభించారు. అందువలనే బాహుబలి 2 చేయలేకపోయానని శ్రీనివాస్ మోహన్ అన్నారు.

ఆర్ఆర్ఆర్ అలాంటి చిత్రం కాదు
ప్రస్తుతం తాను పనిచేస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి శ్రీనివాస్ మోహన్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ అనేది విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం కాదని అన్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది కామన్ గా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ వాటికే సినిమాలో అధిక ప్రాధాన్యత ఉండదని తెలిపారు.

వామ్మో 'ఆర్ఆర్ఆర్' గురించా
ఆర్ఆర్ఆర్ గురించి ఇంకేమైనా విశేషాలు చెప్పగలరా అని ప్రశ్నించినప్పుడు.. శ్రీనివాస్ మోహన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ గురించి రాజమౌళి ఒక్క మాట కూడా మాట్లాడవద్దని చెప్పారు. ఆ చిత్రం గురించి రాజమౌళి తప్ప ఇంకెవరూ మాట్లాడే అవకాశమే లేదని శ్రీనివాస్ మోహన్ తెలిపారు. దీన్నిబట్టే అర్థం అవుతోంది.. ఆర్ఆర్ఆర్ విశేషాలు లీక్ కాకుండా రాజమౌళి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో అని.


Click it and Unblock the Notifications











