బుజ్జి తమ్ముడిని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీకి పరిచయమై మంచి పేరే సంపాదించుకున్నాడు. ఇప్పుడు అబ్బాయిగారి మరో బ్రదర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అతడి పేరు స్టార్మ్ దేవరకొండ. ఇంటి పేరు దేవరకొండ అయినా మూలాలు మాత్రం సెర్బియావి. ఎందుకంటే, మనోడు సెర్బియా జాతి హస్కీ కుక్కపిల్ల కాబట్టి.
లాక్ డౌన్ పుణ్యమాని సోషల్ మీడియా మస్త్ హడావిడి చేస్తున్న విజయ్, ప్రతి చిన్న విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు. జనాలను వినోదపరచడానికి సిల్వర్ స్క్రీన్ తోనే పనిలేదని నిరూపిస్తున్నాడు. ఆ మధ్య కష్టంలో ఉన్న కుటుంబాలను ఆదుకుని పెద్ద మనసు చాటుకున్న మన రౌడీ హీరో, తాజాగా ఓ బుజ్జికుక్కపిల్లను దత్తత తీసుకున్నాడు. ఇక స్టార్మ్ దేవరకొండతో ఫొటోలు దిగి ఇన్స్టాలో పోస్ట్ చేశాడో లేదో, నిమిషాల వ్యవధిలో అవి వైరల్ గా మారిపోయాయి.

అయితే ఫొటోల్లో విజయ్ కన్నా స్టార్మ్ కే ఎక్కువ లైకులు పడ్డాయి అనడంలో సందేహమే లేదు. సూపర్ క్యూట్ గా కనిపిస్తున్న స్టార్మ్, నీలికళ్లతో భలే మురిపిస్తున్నాడు. దీంతో పాయల్ రాజ్ పుత్, యాషికా ఆనంద్ వంటి భామలు సైతం కొత్త దేవరకొండ మురిపాలకు ఫిదా అయిపోయారు.
అబ్బా బుజ్జాయి భలే ముద్దుగా ఉన్నాడు అంటూ ముద్దుగుమ్మలు కామెంట్ల రూపంలో ప్రేమను గుమ్మరిస్తున్నారు. ఏమైనా, స్టార్మ్ అప్పుడే ఫేమస్ అయిపోయాడు అనడంలో సందేహమే లేదు.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫైటర్ చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ, లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యాడు. పరిస్థితులు అనకూలిస్తే త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే యోచనలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











