వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమకథల్లో అదే ఆసక్తికరం: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఫిబ్రవరి 14న భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ విశేషాలు, ఆసక్తికర సన్నివేశాల గురించి చెప్పారు.
ఈ సినిమాలోని ప్రేమకథల్లో ఇల్లందు నేపథ్యంలో తనకు, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు మధ్య వచ్చే ప్రేమకథ ఆసక్తిగా ఉంటుందని చెప్పారు విజయ్. చదువుకోని భార్యా భర్తల కాపురం నేపథ్యంలో వచ్చే ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అన్నారు. కుటుంబ బాధ్యతలతో డబ్బుకు విలువిచ్చే యువకుడిగా ఆ పాత్రలో కనిపిస్తానని చెప్పారు విజయ్ దేవరకొండ. అందుకు భిన్నంగా ఫ్రాన్స్ నేపథ్యంలో వచ్చే ప్రేమకథలో కనిపిస్తానని, విదేశీ పైలట్‌ను ప్రేమిస్తూ.. డబ్బుకు విలువ ఇవ్వని యువకుడిగా ఆ రోల్ ఉంటుందని అన్నారు. రాశీ ఖన్నాకు, తనకు మధ్య ప్రేమకథలో తన పాత్ర కొంచెం 'అర్జున్‌రెడ్డి'ని తలపిస్తుందని చెప్పారు.

''ఇల్లందు నేపథ్యంలో వచ్చే కథలో శీనయ్యపాత్రను మా నాన్న స్ఫూర్తితో చేశా. ఆ పాత్రలో నటిస్తునపుడు.. నా చిన్నతనంలో నాన్న లుంగీ కట్టుకునే తీరు, హావభావాలు, మాట్లాడే తీరు లాంటివి గుర్తు చేసుకున్నా. సెట్‌లో తొలి షాట్ చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డా కానీ ఆ తర్వాత ఈజీగా చేసేశా'' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
కె.ఎస్. రామారావు సమర్పణలో 'వరల్డ్ ఫేమస్ లవర్' తెరకెక్కింది. కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రానికి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించారు. వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు అందాల భామలు రాశి ఖన్నా, ఇసాబెల్లా, క్యాథెరిన్ ట్రెస్సా, ఐశ్వర్య రాజేష్ నటించారు.


Click it and Unblock the Notifications











