చిరంజీవితో విజయ్ దేవరకొండ.. సెన్సేషనల్ రీమేక్‌లో క్రేజీ రోల్
సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆచార్య తర్వాత లూసిఫర్ చిత్రంలో నటించడానికి చిరంజీవి సిద్దమవుతున్నారు. సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్‌గా మలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త మీడియాలో ప్రచారమవుతున్నది. అయితే ఈ వార్తను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. అయితే గతంలో మెగా హీరో నటిస్తున్నారని, అల్లు అర్జున్ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. రాంచరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త నిజమైతే రాంచరణ్ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ స్వీకరిస్తాడా అనే విషయం చర్చనీయాంశమైంది.

అయితే మెగా కాంపౌండ్ లాంటి గీతా ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ గీతా గోవిందం చిత్రంలో నటించడం, ఆ సినిమా ఘనవిజయం సాధించడం తెలిసిందే. ఆ సినిమా వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, విజయ్ దేవరకొండ యాక్టింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. ఈ క్రమంలో చిరంజీవితో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తే అది సెన్సేషనల్‌గా మారే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రూపొందించే ప్యాన్ ఇండియా మూవీ ఫైటర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కరోనావైరస్ కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక మళ్లీ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











