ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన విజయ నిర్మల!
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. 73 వయసులో ఆమె సూపర్ స్టార్ కృష్ణ, అభిమానులను శోక సముద్రంలో ముంచి వేస్తూ సుదూర తీరాలకు వెళ్లిపోయారు.
ఏడవ ఏటనే బాలనటిగా ప్రస్థానం మొదలు పెట్టిన విజయ నిర్మల ఎన్నో చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా తన సత్తా చాటారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తి చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని ఆమె తపన పడుతుంటేవారట. అయితే 44 సినిమాలు చేసిన తర్వాత ఆమె అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సినిమాలకు దూరం అయ్యారు.
ఆరోగ్యం కుదుట పడటంతో 2013లో ఆమె దర్శకురాలిగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు. అయితే ఆమె ప్రయత్నాలు ముందుకు సాగలేదు. దర్శకురాలిగా 50 సినిమాలు చేయాలనే కోరిక తీరకుండానే ఆమె కన్ను మూశారు.
విజయనిర్మల పార్థివదేహాన్ని గురువారం మొత్తం ప్రముఖుల సందర్శనార్థం ఇంట్లోనే ఉంచి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











