కాజల్ నా పేరు మరచిపోయందంటూ...స్టార్ డైరక్టర్
హైదరాబాద్ : ఈ చిత్రంలో కాజల్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమె అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలు చేయడం వల్ల నా పేరు మరచిపోతుండేది అన్నారు ప్రముఖ దర్శకుడు మురగదాస్.ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'తుపాకి'. విజయ్, కాజల్ జంటగా నటించారు. హారిస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారు. సిహెచ్ శోభ నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.
అలాగే... '' ''స్టాలిన్ చిత్రం కోసం చిరంజీవితో కలిసి పనిచేసినపుడు ఆయన శైలి ఎంతగానో నచ్చింది. మళ్లీ ఇప్పుడు విజయ్‌లో ఆ శైలి చూశాను. ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్. గజినితో సూర్యకి తెలుగు మార్కెట్ ఎలా పెరిగిందో ఈ సినిమాతో విజయ్‌కు అంత పెద్ద మార్కెట్ వస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు హీరోలు తమిళనాడులో మార్కెట్ పెంచుకోవాలి. ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతో, అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతో పనిచేస్తే మార్కెట్ పెరుగుతుంది. తమిళ చిత్ర పరిశ్రమకు పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లాంటి స్టార్‌లు రావాలి. తమిళ కథానాయకులు తెలుగు చిత్రాల్లో నటించాలి. అప్పుడే సినిమా మార్కెట్ విస్తృతమవుతుంది. ఇది అందరికీ ఉపయోగకరమైంది. రెండు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వం పెరుగుతుంది. 'తుపాకి'లో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి డార్క్ షేడ్, రెండోది యాక్షన్ ప్యాక్డ్ ప్రేమకథా చిత్రం. '' అన్నారు మురుగదాస్.
విజయ్ మాట్లాడుతూ ''శంకర్ నన్ను తెలుగు ప్రేక్షకులకి స్నేహితుణ్ని చేశారు. మురుగదాస్ 'తుపాకి'తో మిమ్మల్ని కలవబోతున్నాను. పక్కా కథ కథనాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు వారు మంచి చిత్రాలకు బ్రహ్మరథం పడతారని తెలుసు. ఈ సినిమా క్లాస్, మాస్ అందరికీ నచ్చుతుంది. తుపాకిలో ఆరు బుల్లెట్లను లోడ్ చేశాం. ప్రస్తుతం పాలిష్ వర్క్ జరుగుతోంది.'' అన్నారు.
''ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైంది. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది''అన్నారు కాజల్. నవంబర్ 9న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. జెమిని ఫిల్మ్ సర్కూట్ నిర్మిస్తున్న చిత్రం 'తుపాకి'. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీఆర్ మీడియా విడుదల చేస్తోంది. శోభ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.


Click it and Unblock the Notifications











