సరిలేరు నీకెవ్వరు: విజయశాంతి లుక్ రివీల్.. అప్పుడెలాగో ఇప్పుడు అలానే.!
విజయశాంతి.. ఈ పేరుతో తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆ నాటి హీరోల నుంచి నిన్నటి తరం వాళ్ల వరకు ఎంతో మందితో ఆడిపాడిందామె. అలాగే, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో చాలా సినిమాలు విజయం సాధించాయి. అందుకే ఈమెను లేడీ అమితాబ్ అని పిలుస్తుంటారు. ఈమె చివరి సారిగా 2006లో 'నాయుడమ్మ' అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరోసారి ఆమె మేకప్ వేసుకోలేదు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత మరింత స్పీడు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ మారడంతో కొంచెం వెనుకబడ్డారు. ఇక, రీఎంట్రీలో మాత్రం దుమ్ము దులుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయశాంతి టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు.
'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి ఏ పాత్రలో నటిస్తున్నారన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, దీని గురించి ఎన్నో వార్తల ప్రచారం అయ్యాయి. ఆమె.. మహేశ్ తల్లిగా నటిస్తుందని కొందరు అంటే.. కాదు కాదు.. మహేశ్ స్నేహితుడి తల్లిగా కనిపించబోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె ఫొటోను చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.
అంతేకాదు, 'పదమూడేళ్ల తర్వాత విజయశాంతి గారు మేకప్ వేసుకున్నారు. అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. అదే క్రమ శిక్షణ, అదే యాటిట్యూడ్, అదే దూకుడుతో కనిపిస్తున్నారు. వెల్‌కమ్ విజయశాంతి గారు' అని ఆయన అందులో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











