విక్రమ్ 'ఐ' పాటల (తెలుగు) విడుదల హైలెట్స్ (ఫొటోలు)
హైదరాబాద్ :విక్రమ్, అమీజాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ఐ'. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన 'ఐ' గీతాల్ని మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
‘ఐ' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకొని యుఎస్‌లో మొత్తం 450 థియేటర్లలో విడుదలవుతుంది. రిలీజ్ సమయంలో ఇంకా స్ర్కీన్లు పెరిగే అవకాశం కూడా ఉందట. శంకర్, విక్రమ్, అమీజాక్సన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొదించారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ బాణీలు అందించారు.
''నేను ఇప్పటి వరకూ తెలుగులో సినిమా చేయలేదు. కేవలం నా సినిమాలన్నీ అనువాదాల రూపంలోనే తెలుగులో విడుదలయ్యాయి. అయినా సరే.. నన్నూ, నా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వారి కోసమైనా త్వరలో ఓ తెలుగు సినిమా చేస్తా'' అన్నారు ప్రముఖ దర్శకుడు శంకర్.
స్లైడ్ షోలో....విడుదల విశేషాలు...

తొలి సీడిని...
తొలి సీడీని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అందుకొన్నారు.

శంకర్ మాట్లాడుతూ...
''ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. విక్రమ్ తన శక్తినంతా ధారబోశాడు. సన్నబడాలన్న ఆలోచన మాత్రం తనదే. నేను వద్దని చెప్పినా 'సార్.. నేను చేస్తా' అన్నాడు. ఏం చేసినా ఆరోగ్యం జాగ్రత్త అని సూచించా. సాధారణంగా నా సినిమాలో దృశ్యాలన్నీ దాచిపెడుతుంటా. కానీ ప్రచార చిత్రాల రూపంలో కొన్ని షాట్స్ చూపించా. అందుకే అంచనాలు ఎక్కువయ్యాయి. అయినా ఫర్వాలేదు.. వాటిని అందుకొనే సినిమా ఇది.

అవే స్పూర్తి...
పీసీ శ్రీరామ్‌తో ఎప్పటినుంచో రెండో సినిమా చేద్దామనుకొన్నా. కానీ ఇప్పటికి కుదిరింది. రెహమాన్ మళ్లీ నాకు అద్భుతమైన బాణీలు అందించారు. నిర్మాతని సంప్రదించినప్పుడు 'నేను చాలా సినిమాలు చేశా. కానీ మీతో సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలన్నా'రు.. ఆమాటే నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా శ్రీనివాస్‌మోహన్ పనిచేశారు. ఆయన తెలుగువారే. త్రివిక్రమ్, బోయపాటి శ్రీను నాకోసం ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు శంకర్.

'బాహుబలి' కోసం ఎదురుచూస్తున్నా
రాజమౌళి 'మగధీర', 'ఈగ' సినిమాలు చూసి అభిమానిగా మారిపోయా. 'బాహుబలి' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అన్నారు శంకర్.

రాజమౌళి మాట్లాడుతూ....
''చెన్నైలో నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు 'ప్రేమికుడు'లోని 'ముక్కాల ముక్కాబుల' పాట విడుదలైంది. అప్పుడు సాంకేతిక గురించి అంతగా తెలీదు నాకు. ఆ పాట ఎలా తీశారా అని అందరూ చర్చించుకొనేవాళ్లం. ఇప్పుడు 'ఐ' ప్రచార చిత్రాలు చూసి మళ్లీ అదే షాక్. అందులోని ప్రతి ఫ్రేమూ ఎలా తీశారా అని ఆశ్చర్యపోతున్నాం. సాంకేతికత విషయంలో శంకర్ అంత ముందుంటారు''అని చెప్పారు.

విక్రమ్ మాట్లాడుతూ ...
''నాకో మంచి టీమ్ దొరికింది. వాళ్ల సహకారంతోనే బరువు పెరిగా. తగ్గాను. రూపం మార్చుకోవడానికి ఎనిమిది నెలలు పట్టింది. చాలా కష్టమే. అయితే ఆసక్తిగా అనిపించి ఇష్టంగా చేశా. మేకప్ కోసం ఐదు గంటలు పట్టేది. తీసేయ్యడానికి మరో రెండు గంటలు పట్టేది. 'ఐ' కథ చెప్పినప్పుడే ఈ సినిమా కోసం ఏమైనా చేయాలనుకొన్నా. ఈ పాత్రలో అంత విషయం ఉంది. ఈ కథ నేనే కాదు, ఎవరు విన్నా ఇలానే కష్టపడతారు. '' అన్నారు.

తెలుగువాళ్లు ఉత్తమ ప్రేక్షకులు
''నా వరకూ 'ఐ' ఒక కల. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ మూడేళ్లు కేటాయించాం. మరో సినిమా కూడా చేయలేదు. తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలోనే ఉత్తమ ప్రేక్షకులు. ఎక్కడకు వెళ్లినా నేను ఇదే మాట చెబుతా. సినిమా అంటే అంత అభిమానం ఇక్కడి వాళ్లకు మరో మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ...
ఐ అంటే తమిళంలో మీనింగ్ కూడా నాకు తెలియదు. ఈ సినిమాని రెండు కళ్లున్న ప్రతీ ఒక్కరూ చూస్తారు... శంకర్ సార్ మీరంటే మాకు చాలా ఇష్టం..మార్గ దర్శకులు అన్నారు.

అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ...
తనకు ఈ చిత్రంలో పాట రాయటం అదృష్టం అన్నారు. ఎఆర్ రహమాన్, శంకర్ వంటి శిఖరాలను అధిరోహించి విజయాన్ని సాధించాం. ఇందులో పూలకే కునుకెయ్యమంటా అనే పాట రాసాం అన్నారు.

రామజోగయ్య శాస్త్రీ మాట్లాడుతూ...
అందరిలాగే ఈ చిత్రం ఎదురుచూస్తున్నా అన్నారు. శంకర్ గారి ఆకాసమే హద్దు. ఈ సినిమాల్లో క్లైమాక్స్ లో వచ్చే బీస్ట్ గెటప్ సాంగ్ రాసాను.వారి అంచనాలు కు తగ్గట్లే రాసాను అన్నారు. ఆయనలో తెలుగులో మాట్లాడగలరు...అన్నీ అర్దమవుతాయి. అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...
అందరిలాగే నేనూ ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం. 14న అందరం ఈ సినిమా చూస్తాం. మేము మీ ఫ్యాన్ ని అన్నారు.

ఎవరెవరు...
ఈ కార్యక్రమంలో బోయపాటి శ్రీను, ముత్తురాజు, పీసీ శ్రీరాం, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, అనంతశ్రీరామ్, ఆర్.బి.చౌదరి, పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











