షాక్: శంకర్ ‘ఐ’ చిత్రం వచ్చే నెలకు వాయిదా
హైదరాబాద్: సంక్రాంతికి శంకర్ ‘ఐ' చిత్రం వస్తుందని ఎదురు చూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్. ఈ చిత్రం మరో మూడు వారాలకు వాయిదా పడింది.. సినిమా విడుదల నిలిపి వేయాలని మద్రాసు హై కోర్టు గురువారం ఆర్డర్స్ జారీ చేసిన నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇటీవల అధికారికంగా ప్రకటించినప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకోక తప్పలేదు. కోర్టు వివాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.
చియాన్ విక్రమ్ కథానాయకుడుగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘ఐ' చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా డిసెంబర్ 30న విడుదలై సంగీత ప్రియుల నుండి మంచి స్పందన సొంతం చేసుకుందని, ఎక్కడ చూసినా ‘ఐ' పాటల జోరే ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ భారీ విజువల్ వండర్‌ని ఆస్కార్ ఫిలింస్ వి.రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రై.లి అధినేతలు కలిసి తెలుగులో విడుదల చేయాల్సి ఉంది. అన్ని పనుల్ని పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో కోర్టు వివాదం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ సరసన యామీ జాక్సన్ కథానాయికగా నటించింది.
సురేష్ గోపి, ఉపేన్ పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ మొదలైన వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్.


Click it and Unblock the Notifications











