‘మెగా’ సిగ్నల్ కోసం వినాయక్ వెయిటింగ్
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవికి ఠాగూర్ లాంటి సెన్సేషన్ హిట్ అందించిన వివి వినాయక్.... మెగా స్టార్ 150వ సినిమాకు కూడా దర్వకత్వం వహించడానికి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టం వెల్లడించారు. ఎంతకాలం అయినా వెయిట్ చేయడానికి సిద్ధమన్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలు బట్టి చిరంజీవి 150వ సినిమా కథ, స్ర్కిప్టు సిద్ధంగా ఉందని, చిరంజీవి ఓకే అనడమే తరువాయి అని స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'నాయక్' చిత్రాన్ని రూపొందిస్తున్న వివి వినాయక్ ఈ చిత్రం తర్వాత ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. దాన్ని బట్టి చిరంజీవి 150వ సినిమా కోసమే వినాయక్ నాయక్ తర్వాత ఇతర ప్రాజెక్టులను ఇంకా ఓకే చేయలేదని అంటున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.
లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న తన చిత్రాన్ని ఎవరికి టార్గెట్ చేయాలి...తన అభిమానులను సంతృప్తిపరచే విధంగా సీన్స్ ఉంచాలా వద్దా అనే విషయాలపై చిరంజీవి తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి హిట్ చిత్రాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్... ఈ సినిమాతో మళ్లీ తమ కలం బలం ఏమిటో చూపనున్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున సినిమాలో రాజకీయ అంశాలను ఏ మేరకు స్పృశించాలనే విషయమై కూడా వెనకాముందు ఆలోచిస్తున్నారు.
సినిమాలో ఏ సమస్యను ప్రస్తావించినా అది ప్రభుత్వంపై విర్శలాగా ఉంటుంది కనుక... అటు ప్రభుత్వాన్ని నొప్పించకుండా, ఇటు మెసేజ్ ఓరియెంటెడ్ గా ప్లాన్ చేస్తూనే కమర్షియల్ అంశాలతో సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే ఈచిత్రం ఈ సంవత్సరంలో మొదలయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే వివి వినాయక్ ప్రస్తుతం చరణ్ తో 'నాయక్' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమా 2013లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











