మహా చండీ హోమం...చేస్తున్న మంచు విష్ణు
బ్రాహ్మణుల శాపనార్థాల నేపథ్యంలో తమ కుటుంబానికి ఎలాంటి కీడు జరుగకుండా ఉండటానికి ఈ రోజు మోహన్ బాబు కుటుంబ సభ్యులు మహా చండీ హోమం చేపట్టారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈరోజే మహా చండీ యాగం మొదలు పెట్టాం. నా కూతుర్లు అరియానా, వివియాన తొలి రోజు పూజలో పాల్గొన్నారు' అని ట్వీట్ చేసాడు.
గతంలో జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే...
సెన్సార్ బోర్డ్ ఓకే చేసిన తర్వాతనే తాము 'దేనికైనా రెడీ' చిత్రాన్ని రిలీజ్ చేసామని, ఏవో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు తన తండ్రికి పిండ ప్రదానాలు చేసి, తమను మనోవేదనకు గురిచేశారని నటుడు మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేసారు. బ్రాహ్మణ సంఘాలు కూడా ఏమాత్రం తగ్గకుండా మోహన్ బాబుపై, దేనికైనా రెడీ చిత్రంపై కోర్టు కెక్కాయి.
మోహన్ బాబు ప్రధాన పాత్రలో విష్ణు 'రావణ బ్రహ్మ' అనే సినిమాకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన మంచు విష్ణు ప్రస్తుతం ఏ చిత్రంలోనూ నటించడం లేదు.


Click it and Unblock the Notifications












