నో డిటిహెచ్ రిలీజ్, సంక్రాంతి బరి నుంచి ‘విశ్వరూపం’ ఔట్?
హైదరాబాద్ : కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న 'విశ్వరూపం' చిత్రాన్ని ఈ నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి 25న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమా వాయిదా పడింది కాబట్టి డిటిహెచ్ రిలీజ్ కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
విశ్వరూపం చిత్రానికి కమల్ హాసన్ స్వయంగా నిర్మాత. ఎక్కువ ఖర్చు చేసిన సినిమాకు ఎక్కువ లాభాలు తెచ్చుకోవడంలో బాగంగా ఈ చిత్రాన్ని డిటిహెచ్ ద్వారా నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ నిర్ణయాన్ని తమిళనాడు థియేటర్ల ఓనర్లు వ్యతిరేకిస్తుండటం, ప్రదర్శనను బహిష్కరిస్తామనే హెచ్చరికల నేపథ్యంలో ముందుగా అనుకున్న సమయానికి విడుదల ప్రశ్నార్థకంగా మారింది.
'విశ్వరూపం'ను డీటీహెచ్‌లో ప్రసారాలు చేస్తే చంపేస్తామంటూ కొందరు తనకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారని నటుడు కమల్ హాసన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆదివారం ఆయన చెన్నైలోని అడిషనల్ డీజీపీ కార్యాలయంలో ఏడీజీపీ రాజేంద్రన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సినిమా పైరసీ సీడీలు తయారుచేస్తామని, సినిమా ప్రసార సమయంలో విద్యుత్ ప్రసారాలు లేకుండా చేస్తామని తనను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కమల్ హాసన్ చెప్పిన వివరాల ప్రకారం.... ఈ చిత్ర నిర్మాణానికి రూ. 95 కోట్లు ఖర్చయింది, డిటిహెచ్ రిలీజ్ ద్వారా అయితేనే తమకు 100శాతం లాభాలను తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ఇటీవల మాట్లాడుతూ... 'విశ్వరూపం చిత్రం నుంచి నేను 100 శాతం లాభాలను ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. థిట్రికల్ రైట్స్, డిటిహెచ్ రైట్స్ అన్నీ కలిపి రూ. 350 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నాను' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











