విశ్వరూపం: అప్పుడు ముస్లింలు, ఇప్పుడు క్రైస్తవులు
హైదరాబాద్: కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వరూపం' చిత్రంపై ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేయడం మూలంగా తమిళనాడులో ఆచిత్ర ప్రదర్శన నిలిపి వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రాపై క్రైస్తవ మతస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఈ పిటీషన్ ను తోసి పుచ్చింది.
సి. జేబాకుమార్ జార్జ్ అనే వ్యక్తి 'విశ్వరూపం' చిత్రం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉందని మద్రాస్ హైకోర్టులో మంగళవారం(జనవరి 5) పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ జార్జ్ జనవరి 27న తిరువనంతపురంలో వివాదాస్పద 'విశ్వరూపం' చిత్రాన్ని చూసినట్లు వెల్లడించారు. సినిమాలో పలు సీన్లు చాలా హింసాత్మకంగా ఉన్నాయని, కొన్ని మతాలను, జాతులను కించ పరిచే విధంగా ఉందని, కొన్ని సీన్లు క్రైస్తవ మతస్తులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అయితే హైకోర్టు ఈ పిటీషన్ ను తోసి పుచ్చింది.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు.
తమిళనాడు బ్యాన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్ట పోయింది. ముస్లిం సంస్థలతో చర్చల అనంతరం ఎట్టకేలకు సమస్య పరిష్కారం అయి ఈ నెల 7న తమిళనాడులో విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











